‘పద్మావతి’కి తప్పని కష్టాలు.. సినిమాకు వ్యతిరేకంగా నిరసన, బంద్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రానికి కష్టాలు తప్పేలా లేవు. ఈ సినిమాకు వ్యతిరేకంగా శుక్రవారం పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
జైపూర్: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'పద్మావతి' చిత్రానికి కష్టాలు తప్పేలా లేవు. గుజరాత్‌లో ఎన్నికల దృష్ట్యా ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలని ఓ వైపు భాజపా కోరుతుండగా.. మరోవైపు రాజస్థాన్‌లో సినిమాకు వ్యతిరేకంగా శుక్రవారం పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
చిత్తోర్‌ఘర్‌లో రాజ్‌పుత్ కర్ణి సేన సంఘం ఆధ్వర్యంలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. నిరసనల కారణంగా స్కూళ్లు, మార్కెట్లు, మందుల దుకాణాలు మూతపడ్డాయి. నిరసన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.

భన్సాలీ చరిత్రను వక్రీకరిస్తూ చిత్రాన్ని తెరకెక్కించారంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ సన్నివేశాలపై వారు అభ్యంతరం వ్యక్తంచేశారు. సినిమా విడుదలకు ముందు చిత్రాన్ని తమ ప్రతినిధులకు చూపించి, ఆ తర్వాతే విడుదల చేయాలని రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ కన్వీనర్ ప్రమోద్ రాణా అన్నారు.
చిత్రీకరణ సమయంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 'పద్మావతి'ని డిసెంబర్ 1న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రలో రాణి పద్మినిగా దీపికా పదుకొణె నటిస్తుండగా.. మహారావల్ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్ నటిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications