వాజపేయికి 'బంగ్లా విముక్తి' పురస్కారం: అందుకోనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని బంగ్లాదేశ్ ప్రభుత్వం గౌరవించనుంది. పాకిస్ధాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడంలో అందించిన విశిష్ట సేవలకు గాను ఆయనకు ‘ఫ్రెండ్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్' పురస్కారం అందించాలని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
1971లో భారతీయ జన సంఘ్ అధ్యక్షుడిగా, ఎంపీగా విమోచన (లిబరేషన్) యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యోద్యమానికి సంపూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బంగ్లాదేశ్‌కు మద్దుతుగా నిలిచారని అందుకు గుర్తుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

అనారోగ్యం కారణంగా వాజపేయి బంగ్లాదేశ్‌లో పర్యటించలేరు కాబట్టి.... ఈనెల 6న బంగ్లాదేశ్ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ నెల ఆరు నుంచి బంగ్లాదేశ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్న సంగతి తెలిసిందే.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రకటించిన ఈ పురస్కారాన్ని ఆమె తరుపున 2012లో సోనియాగాంధీ స్వీకరించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ అవార్డుని అందుకున్నారు. దీంతో పాటే బంగ్లా స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికుల కుటుంబాలను గౌరవించాలని కూడా బంగ్లా ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications