వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాదేశ్: ‘దుర్గాపూజ మండపంలో ఖురాన్ పెట్టిన వ్యక్తిని గుర్తించాం’ - పోలీసుల ప్రకటన

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

బంగ్లాదేశ్‌ కుమిల్లా నగరంలోని దుర్గా మండపంలో రహస్యంగా ఖురాన్‌ గ్రంథాన్ని పెట్టిన వ్యక్తిని గుర్తించారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించామని, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.

దుర్గాపూజ మండపంలో ఉంచి ఖురాన్‌ను అవమానించారనే కారణంతో బంగ్లాదేశ్‌లోని అనేక హిందూ దేవాలయాలు, మండపాలు, ఇళ్లపై దాడులు జరిగాయి.

గత వారం రోజుల్లో జరిగిన ఈ హింసలో కనీసం ఏడుగురు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

'ఈ కేసులో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తిని గుర్తించాం. అతని కోసం వెతుకుతున్నాం'' అని బీబీసీ బంగ్లాతో కుమిల్లా డిప్యూటీ కమిషనర్ మొహమ్మద్ కమ్రుల్ హసన్, పోలీస్ సూపరింటెండెంట్ ఫరూఖ్ అహ్మద్ చెప్పారు.

దుర్గా మండపంలో ఖురాన్ గ్రంథాన్ని పెట్టిన వ్యక్తి ఎవరు?

ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి వివరాలు వెల్లడించేందుకు పోలీసు అధికారులు నిరాకరించారు. అయితే, బంగ్లాదేశ్ స్థానిక మీడియాలో మాత్రం ఆ వ్యక్తి పేరును పోలీసులు వెల్లడించినట్లుగా కథనాలు వచ్చాయి.

ఈ ఘటనలో ఇక్బాల్ హుస్సేన్‌ను నిందితుడిగా గుర్తించామని పోలీసు వర్గాలు చెప్పినట్లు బంగ్లాదేశ్ వార్తాపత్రిక 'డైలీ అబ్జర్వర్' తెలిపింది. ఆయన కుమిల్లాలోని సుజాన్నగర్ ప్రాంతానికి చెందినవాడని చెప్పింది. ఆయన తండ్రి పేరును నూర్ అహ్మద్ ఆలమ్‌గా పేర్కొంది.

నిందితుని వయస్సు 30 ఏళ్లు ఉంటుందని 'డైలీ స్టార్' పత్రిక ప్రచురించింది.

'ఇక్బాల్, ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. ఆయన ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తా? లేక సాధారణ పౌరుడా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు చెప్పినట్లు'' ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది.

ఇక్బాల్ మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడని, సొంత కుటుంబ సభ్యులనే పలు రకాలుగా చిత్రహింసలకు గురిచేసేవాడని ఆయన తల్లి అమీనా బేగమ్ చెప్పారని ఢాకా ట్రిబ్యూన్ రాసుకొచ్చింది.

''దేశంలోని వేర్వేరు ప్రదేశాల్లో నివసించడమంటే ఇక్బాల్‌కు ఇష్టం'' అని అమీనా బేగమ్ తెలిపారు.

''పదేళ్ల క్రితం కొంతమంది పొరుగువారు అతన్ని కడుపులో పొడిచారు. అప్పటినుంచి ఇక్బాల్‌ కొన్ని మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు'' అని అమీనా బేగమ్ చెప్పారు.

ఒకవేళ ఇక్బాల్ నిజంగా తప్పు చేసి ఉంటే అతన్ని కచ్చితంగా శిక్షించాలి అని ఆయన కుటుంబ సభ్యులు అన్నారు. కొన్ని గ్రూపులు ప్రేరేపించడం వల్లే ఇలా చేసి ఉంటాడేమో అని ఆయన తమ్ముడు రైహాన్ వ్యాఖ్యానించారు.

ఇక్బాల్‌ను వెతకడంలో శుక్రవారం నుంచి పోలీసులకు సహాయం చేస్తున్నానని రైహాన్ చెప్పారు.

బంగ్లాదేశ్ దుర్గాపూజ మండపం

సీసీటీవీ ఫుటేజీలో ఏం కనిపించింది?

ఈ మొత్తం ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి, చేతిలో ఏదో పట్టుకొని పూజ మండపంలోకి వెళ్లడం... తిరిగి హనుమంతుడి గద తీసుకొని వెనక్కి తిరిగి రావడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

బుధవారం, నవరాత్రుల్లో ఎనిమిదో రోజైన అష్టమి నాడు కుమిల్లా దుర్గా పూజ మండపంలో ఈ ఖురాన్ కనిపించింది. పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను అవమానించారని ఆరోపిస్తూ కొంతమంది దుర్గాపూజ మండపాన్ని ధ్వంసం చేశారు.

ఈ ఘటన జరిగిన వెంటనే, బంగ్లాదేశ్‌లోని చాంద్‌పుర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఘర్షణలను ఆపడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ హింసలో కనీసం ఐదుగురు మరణించగా, అనేక మందికి గాయాలయ్యాయి.

బంగ్లాదేశ్ పోలీస్

పోలీసులు ఏం చెప్పారు?

అక్టోబర్ 13న కుమిల్లాలో ఏం జరిగిందో, దానికి సంబంధించి తామేం చర్యలు తీసుకున్నారో తెలుపుతూ పోలీసులు అదే రోజు ఒక ప్రకటనను విడుదల చేశారు.

కుమిల్లాతో పాటు చాంద్‌పుర్‌లోని హాజీగంజ్, నోవాఖలిలోని బేగమ్‌గంజ్, రంగ్‌పుర్‌లోని పీర్‌గంజ్, కాక్స్ బజార్, హబీగంజ్, ఘాజీపూర్‌లలో విధ్వంసాలతో పాటు దాడులు జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

బంగ్లాదేశ్‌లో గత వారంలో జరిగిన హింసల్లో కనీసం ఏడుగురు చనిపోగా, అందులో ఇద్దరు హిందువులు.

ఘర్షణలను నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాల్లో కనీసం 50 మంది గాయపడ్డారు.

పోలీసులు విడుదల చేసిన ప్రకటన, కుమిల్లా ఘటన గురించి అన్ని వివరాలను వెల్లడించింది. పాలనపరంగా అత్యత్తమ విధానాలు పాటించినప్పటికీ, ఘర్షణలు నియంత్రించడానికి అప్రమత్తంగా వ్యవహరించినప్పటికీ దేశంలో చాలా చోట్ల అవాంఛనీయ ఘటనలు జరిగాయని ఆ ప్రకటనలో తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి, అక్టోబర్ 19 నాటికి 72 కేసులను నమోదు చేశామని, 450 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ చర్య వెనుకున్న కారణాలను కనుగొనేందుకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో పుకార్లను నివారించడానికి సైబర్ నిఘాను ముమ్మరం చేశారు.

నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం, వదంతులను నమ్మకుండా ప్రజలంతా పోలీసులకు సహకరించాలని వారు ప్రకటనలో కోరారు.

బంగ్లాదేశ్

కుమిల్లా దుర్గా పూజ మండపంలో ఏం జరిగింది?

బంగ్లాదేశ్‌లోని అనేక నగరాల్లో ఉద్రిక్తతలకు కారణమైన హింస, కుమిల్లా నదీతీరాన ఉన్న దుర్గామండపంలో మొదలైంది. ఇక్కడే చాలా హిందు కుటుంబాలు స్థిరపడ్డాయి. గత 20 ఏళ్ల నుంచి నవరాత్రుల సమయంలో వారంతా, ఇక్కడ తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేసుకొని దుర్గా పూజలు చేస్తున్నారు.

సప్తమి రోజు అర్ధరాత్రి అయ్యాక కూడా భక్తులు మండపానికి వస్తూనే ఉన్నారని దుర్గా పూజ కార్యనిర్వాహక వర్గంలో ఒకరైన అచింత్య దాస్ చెప్పారు. భక్తుల రాక తగ్గిపోయాక, ప్రధాన విగ్రహం ఉన్న మండపాన్ని కర్టెన్లతో మూసివేసినట్లు వెల్లడించారు.

ప్రధాన మండపం అవతల ప్రతిష్టించిన గణపతి మండపం మాత్రం భక్తుల కోసం తెరిచే ఉంది. అక్కడే ఎవరో ఖురాన్‌ను వదిలి వెళ్లారు.

ఆ వేదిక వద్ద ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు దాస్ చెప్పారు. ఉదయం నుంచి గణపతి మండపం దగ్గరే విధులు నిర్వర్తించిన ఆయన... ఖురాన్‌ను పెట్టినప్పుడు మాత్రం అక్కడ లేరని అన్నారు.

బంగ్లాదేశ్ దుర్గాపూజ మండపం

999 హెల్ప్‌లైన్, ఫేస్‌బుక్ లైవ్

సప్తమి మరుసటి రోజు ఉదయం ఒక యువకుడు, హెల్ప్‌లైన్ నంబర్ 999కు ఫోన్ చేసి, తాను మండపంలో ఖురాన్‌ను చూసినట్లు చెప్పారు. మరో యువకుడు ఈ ఘటనను, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లోకి తెచ్చారు.

వీరు తప్ప, ఈ ఘటనకు సంబంధించి ఇతర ప్రత్యక్ష సాక్షులు లేరు. హెల్ప్‌లైన్, ఫేస్‌బుక్ లైవ్‌తో ప్రమేయమున్న అంశాలే బయటకు పొక్కాయి. ఇందులో పాల్గొన్న ఇద్దరు యువకులు ఫయాజ్, ఇక్రమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

''ఈ సంగతి తెలియగానే కొమిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఉదయం 7:30 గంటలకు ఘటనా ప్రదేశానికి వచ్చారు. ఆయన మండపం నుంచి ఖురాన్‌ను తీశారు. ఇదే సమయంలో ఒక యువకుడు అక్కడే ఫేస్‌బుక్ లైవ్ చేశాడు'' అని బీబీసీ బంగ్లాతో అచింత్య దాస్ చెప్పారు.

''మండపంలో ఖురాన్‌ను పెట్టారనే సంగతి నాకు ఉదయం తెలిసింది. అంతలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండపంపై దాడులు జరిగాయి'' అని మండపం దగ్గర్లో నివసించే కుటుంబంలోకి ఒక వ్యక్తి చెప్పారు. ఆయన తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.

ఫోన్ ద్వారా ఈ వార్త తెలుసుకున్న కార్యనిర్వాహక వర్గంలోని సభ్యుడొకరు, ఉదయం 7:30 గంటలకు అక్కడకి చేరుకున్నారు.

''మండపంలో ఖురాన్‌ను పెట్టారనే సంగతి వ్యాప్తి చెందుతోన్న కొద్ది సమయంలోనే అక్కడ పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు. అక్కడ పూజలు నిలిపేయాలని వారంతా డిమాండ్ చేశారు.''

''అంతలోనే ఒక మూక మండపంలోకి వెళ్లి దేవతామూర్తులున్న వేదికను ధ్వంసం చేయడంతో పాటు మండపంపై దాడికి తెగబడింది. ఆ తర్వాత కుమిల్లాలోని అనేక హిందు కుటుంబాలపై, దేవాలయాలపై దాడులు జరిగాయి'' అని ఆయన చెప్పారు.

బంగ్లాదేశ్ షేక్ హసీనా

షేక్ హసీనా వైఖరి

ఈ హింసాత్మక ఘటనల అనంతరం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ 'ఈ అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. హిందు కమ్యూనిటీ ప్రజలకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని'' అన్నారు.

అంతేకాకుండా, బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరిగిన దాడిని భారత్‌కు ముడిపెట్టి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.

బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రత గురించి భారత్ కూడా జాగ్రత్త వహించాలని హసీనా అన్నారు.

తమ దేశాన్ని, తమ దేశంలోని హిందువులపై ప్రభావం చూపించే ఎలాంటి ఘటనలు భారత్‌లో జరగకూడదని ఆమె వ్యాఖ్యానించారు.

ఇటీవలి కాలంలో ఇంతటి తీవ్రమైన హింసాత్మక ఘటనలు జరగలేదని దుర్గాపూజ మండపంలో చెలరేగిన ఘర్షణలను ఉద్దేశించి అన్నారు.

ఈ ఘటన పట్ల, దేశ పాలకవర్గం వైఫల్యంపై అక్కడి హిందు కమ్యూనిటీ అసహనం వ్యక్తం చేసింది.

కుమిల్లా మండపంపై దాడి తర్వాత, దేశంలోని 22 జిల్లాల్లో భద్రతా దళాలను మోహరించారు. అయినప్పటికీ హిందువులపై బహిరంగ దాడులను ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయిందనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Bangladesh:We have identified the person who put Quran in Durgamata Pandal says police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X