బ్యాంక్ ఉద్యోగుల సమ్మె -సోమ, మంగళవారాల్లో లావాదేవీలపై తీవ్ర ప్రభావం! -కేంద్రం తీరుకు నిరసనగా
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగాయి. మొత్తం 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోనున్నాయి.
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులంతా ఈ నెల 15, 16 తేదీల్లో సమ్మె చేస్తామని ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం బ్యాంకింగ్ సేవలు ఉండవు. ఇక సోమ, మంగళవారాల్లో ఉద్యోగుల సమ్మె వల్ల వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయినట్లవుతాయి.

దాదాపు పది లక్షల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో వివిధ బ్యాంకుల శాఖల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్‌ల క్లియరెన్స్, రుణ దరఖాస్తులకు ఆమోదం వంటి సేవలు దాదాపు స్తంభించనున్నాయి. అయితే ఆయా బ్యాంకుల ఏటీఎం సేవలు యథాతథంగా కొనసాగనున్నాయని వాటి యాజమాన్యాలు పేర్కొన్నాయి.
కాగా, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితర ప్రైవేట్ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు యధాతథంగా సాగనున్నాయి. కానీ దేశీయ బ్యాంకింగ్ రంగంలో వీటి వాటా మూడోవంతు మాత్రమే. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని తొమ్మిది ఉద్యోగ సంఘాల వేదిక ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల ప్రైవేటీకరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం సంపాదించుకోవాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకున్న దరిమిలా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనబాటపట్టారు.
10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అంచనా వేశారు. ఉద్యోగ సంఘాల సమ్మె పిలుపు నేపథ్యంలో తమ శాఖలు, కార్యాలయాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో లావాదేవీలపై ప్రభావం పడుతుందని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు సమాచారం ఇచ్చింది.












Click it and Unblock the Notifications