మోదీకి ఇచ్చే లోపే ముక్కలైంది.. అరుదైన తీపి కానుక
భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధాని బార్ట్ డి వేవర్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రికి గుర్తుగా ప్రధాని మోదీకి ఒక అద్భుతమైన 'తీపి' బహుమతిని అందించాలని బెల్జియం ప్రధాని భావించారు. ఇందుకోసం ప్రపంచప్రసిద్ధి చెందిన అత్యుత్తమ బెల్జియన్ చాక్లేట్‌తో ఢిల్లీలోని 'ఇండియా గేట్' నమూనాను ప్రత్యేకంగా చేయించారు. అయితే, బెల్జియం నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణంలో ఉష్ణోగ్రతలు, రాకపోకల ఒత్తిడికి ఆ చాక్లేట్ ఇండియా గేట్ విరిగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా బెల్జియం ప్రధానే విలేకరుల సమావేశంలో సరదాగా వెల్లడించడం అందరిలోనూ నవ్వులు పూయించింది.
హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీ అనంతరం బెల్జియం ప్రధాని బార్ట్ డి వేవర్ మాట్లాడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. "నిజమైన ఇండియా గేట్ దాదాపు శతాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా ధీరత్వంతో నిలబడింది. కానీ, మా చాక్లేట్ ఇండియా గేట్ మాత్రం భారత్‌కు వచ్చే ప్రయాణాన్ని కూడా తట్టుకోలేకపోయింది" అని నవ్వుతూ చెప్పారు. డిప్లొమసీ తీపిదనానికి చాక్లేట్ చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ, దౌత్యపరమైన సుదీర్ఘ ప్రయాణాలకు మాత్రం చాక్లేట్ ఏమాత్రం పనికిరాదని ఇప్పుడు మాకు అర్థమైందని చమత్కరించారు.

రెండో కానుక రెడీగా ఉంది.. మోదీకి అందించే తీరుతాం!
విరిగిపోయినంత మాత్రాన బెల్జియం ప్రధాని తన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. "దీని గురించి మోదీ గారు ఎలాంటి విచారం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. బెల్జియంలో దీనికి సంబంధించిన బ్యాకప్ సిద్ధంగా ఉంది. ఎలాగైనా సరే, ఆ తీపి కానుకను ఎక్కడా చెక్కుచెదరకుండా సురక్షితంగా ప్రధాని మోదీ చేతికి అందించి తీరుతాను. అదే నా లక్ష్యం" అని ఆయన వ్యాఖ్యానించారు. భారత పర్యటనకు చిహ్నంగా బెల్జియం రాయబార కార్యాలయం కూడా ఈ విరిగిపోయిన చాక్లేట్ ఇండియా గేట్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఇండియా గేట్‌నే ఎందుకు ఎంచుకున్నారంటే?
ఈ ప్రత్యేక బహుమతి వెనుక ఉన్న చారిత్రక బంధాన్ని బెల్జియం ప్రధాని వివరించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బెల్జియంలోని 'ఫ్లాండర్స్ ఫీల్డ్స్'లో శత్రువులతో పోరాడి ప్రాణాలర్పించిన వీర భారతీయ సైనికుల త్యాగాలకు గుర్తుగా ఇండియా గేట్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. ఆ చాక్లేట్ నమూనాపై భారతీయ సైనికుల త్యాగాలను స్మరిస్తూ చెక్కిన వాక్యాలను ప్రత్యేకంగా పెద్దవిగా పొందుపరిచారు. వేల మైళ్ల దూరం నుంచి వచ్చి తమ నేల కోసం పోరాడిన భారత సైనికుల ధైర్యసాహసాలను బెల్జియం ఎప్పటికీ మరచిపోదని, ఈ చాక్లేట్ కానుక ఇరు దేశాల గతాన్ని, భవిష్యత్ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.














Click it and Unblock the Notifications