భారత్ ఆతిథ్య హక్కులు రద్దు.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ బిగ్ షాక్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2026' అందాల పోటీల వేదిక మార్పు వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే దిశగా అడుగులు వేసిన భారత్‌కు నిర్వాహకులు ఊహించని షాక్ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం అందించాల్సిన కనీస సౌకర్యాలు, నాణ్యతా ప్రమాణాలను భారత్ నెరవేర్చలేకపోయిందనే నెపంతో, ఈ పోటీలను ఇక్కడ నిర్వహించకూడదని నిర్వాహక సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జరగాల్సిన మిగతా అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం గ్లామర్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది.
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సందేశంలో భారత్‌ను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "పోటీల్లో పాల్గొనే మోడళ్ల రక్షణ, వారికి కల్పించాల్సిన ఫైవ్ స్టార్ ఆతిథ్యం, ప్రొడక్షన్ ప్రమాణాల విషయంలో చేసుకున్న ఒప్పందాలను భారత్ పాటించడంలో విఫలమైంది. పోటీదారుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా అనేక విడతలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అందుకే భారత్ నుంచి ఈ పోటీలను తక్షణమే వేరే దేశానికి తరలిస్తున్నాం" అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భారత్‌ను వేదికగా రద్దు చేసి, ఈ ఈవెంట్ మొత్తాన్ని థాయిలాండ్‌కు మారుస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇకపై థాయిలాండ్‌లోనే వేడుకలు: డేట్స్ అనౌన్స్ చేసిన సంస్థ!
భారత్‌లో జరగాల్సిన ఈ అందాల సమరాన్ని సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 వరకు థాయిలాండ్‌లో నిర్వహించనున్నట్లు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. అక్కడ చేపట్టబోయే కార్యక్రమాలు, వేదికలు, ఇతర షెడ్యూల్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. ఊహించని ఈ మార్పు వల్ల కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూనే, పోటీదారులు, భాగస్వాములు తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ ఏడాది జరిగే పోటీల్లో భారత్ తరఫున లక్ష్షిత తిలగరాజ్ ప్రాతినిధ్యం వహించనున్నారు.
మాకెందుకు ఆ ఆతిథ్యం?.. సోషల్ మీడియాలో నెటిజన్ల గట్టి కౌంటర్!
నిర్వాహకుల ప్రకటనపై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన 'మిస్ వరల్డ్' పోటీలను అత్యంత వైభవంగా, ఐదు నక్షత్రాల హోటళ్ల వసతులతో రెండుసార్లు విజయవంతంగా నిర్వహించిన ఘనత భారత్ సొంతమని గట్టిగా గుర్తుచేస్తున్నారు.
"మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ ఈవెంట్లనే అద్భుతంగా నిర్వహించిన మా దేశానికి ఈ చిన్న పోటీలు ఒక లెక్కా? భారత్‌కు మీ పోటీల అవసరమే లేదు, పైగా ఇది మనకు లభించిన విజయమే" అని నెటిజన్లు తిప్పికొడుతున్నారు. కొందరైతే ఈ రకమైన పోటీలను భారత్‌లో శాశ్వతంగా నిషేధించాలని డిమాండ్ చేస్తుండటంతో, సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది.














Click it and Unblock the Notifications