ఆ బెంగళూరుకు ఓ దండం రా అయ్యా..!!
దేశ సిలికాన్ సిటీగా ఓ వెలుగు వెలుగుతోంది.. బెంగళూరు. హరిత నగరిగా దీనికి గుర్తింపు ఉంది. ఈ పేరు ప్రతిష్ఠలు క్రమంగా మాసకబారుతోందనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. ప్రధానంగా ట్రాఫిక్. వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ క్యాబ్స్ సంఖ్య అధికంగా ఉండటం దీనికి కారణమౌతోంది.
బెంగళూరులో అన్నీ బాగున్నప్పటికీ- ట్రాఫిక్ ను తట్టుకోలేమని చెబుతుంటారు దీని గురించి తెలిసిన వాళ్లు. ట్రాఫిక్ వల్ల బ్రాండ్ బెంగళూరు దెబ్బతింటోందనే అభిప్రాయాలు లేకపోలేదు. తాజాగా- ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రెడిట్ లో పెట్టిన ఓ పోస్ట్.. వైరల్ అయింది. ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

ఈ పోస్ట్.. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాలపై ఆందోళనలను రేకెత్తించింది. Blr Infra is collapsing.. అనే టైటిల్‌తో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించాడా రెడిట్ యూజర్. ట్రాఫిక్, రోడ్ల దుస్థితి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను వివరించారు.
నాన్ పీక్ అవర్స్ లో కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా బెంగళూరులో నివసిస్తున్న ఆ యూజర్.. తన అనుభవాన్ని వివరిస్తూ ఇందిరానగర్ నుండి మాన్యత టెక్ పార్క్‌కు వెళ్లడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందని తెలిపాడు. పైగా అది తెల్లవారు జామున 3:30 గంటలకు కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
10 సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటున్నాను. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు.." అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. ఇందిరానగర్- మాన్యత టెక్ పార్క్ మధ్య దూరం ఆరు కిలోమీటర్లు మాత్రమే. అయినప్పటికీ- తెల్లవారు జామున 3:30 గంటలకు కూడా ఇందిరా నగర్ నుంచి మాన్యత టెక్ పార్క్ కు వెళ్లడానికి రెండు గంటల సమయం పట్టింది.. అని రాశాడు.
ట్రాఫిక్ కష్టాలు మాత్రమే కాకుండా ఎలిమెంట్స్ మాల్ ముందు ఒక బీమ్ కూలిపోవడంతో తెల్లవారు జామున 5:40 గంటల సమయంలో రోడ్డుకు అడ్డంగా పడిందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. రోడ్డుపై గాజు పెంకులు చెల్లాచెదురుగా ఉండటం చూశానని, ఒక కారు ప్రమాదానికి గురై ఉండవచ్చని తెలిపారు.
నగరంలోని క్షీణిస్తున్న మౌలిక సదుపాయాలను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆ పోస్ట్ ద్వారా కోరారు. "రాజకీయ నాయకులు, BBMP అధికారులను ప్రశ్నించగలిగే వారు ఎవరైనా ఉంటే వెంటనే వారిని నిలదీయాలని కోరుతున్నాను.." అని అందులో రాశారు.
ట్రాఫిక్, భద్రతకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికలపై ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ Reddit పోస్ట్‌కు దాదాపు 900 అప్‌వోట్‌లు, వందకు పైగా కామెంట్‌లు వచ్చాయి. నగరంలోని మౌలిక సదుపాయాలు దిగజారుతున్నాయని కొందరు వాదిస్తుంటే, మరికొందరు అవి ఇప్పటికే పూర్తిగా ధ్వంసమయ్యాయని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications