బెంగుళూరు బ్రాండ్ కు పెద్ద దెబ్బ : నష్టం 22వేల కోట్ల పైనే
బెంగుళూరు : కావేరి వివాదంతో బెంగుళూరులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. బెంగుళూరు వాణిజ్యంపై తీవ్ర దెబ్బకొట్టాయి. ముఖ్యంగా ఐటీ నెలవుగా ఉన్న బెంగుళూరులో పలు కార్పోరేట్ కంపెనీలు కోట్లలో నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. ఈ నష్టం విలువ అక్షరాల రూ.25వేల కోట్లని అసోచామ్ ప్రకటించింది.
కర్ణాటక తమిళనాడు మధ్య నెలకొన్న కావేరి జల వివాదంతో.. బెంగుళూరు నగరం అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోగా.. పలు కార్యాయాలు మూతపడ్డాయి. అదీగాక సోమవారం నాడు చెలరేగిన అల్లర్లు తీవ్ర నష్టం వాటిల్లేలా చేశాయి. వీటన్నింటి పర్యవసానంగా బెంగుళూరు నగరం ఇప్పుడు రూ.22 వేల కోట్ల నుంచి రూ.25 కోట్ల దాకా నష్టాన్ని చవిచూసింది.

బెంగుళూరులోని వర్తక, వాణిజ్య వివిధ రకాల పరిశ్రమలన్నింటికీ.. కావేరి వివాదం తీవ్ర ఆటంకంగా మారిందని అసోచామ్ పేర్కొంది. ఫార్చూన్ కంపెనీకి సంబంధించిన దాదాపు 500 కంపెనీలు బెంగుళూరులోనే ఉన్నాయని.. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నగర ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా తయారైందని అసోచామ్ వెల్లడించింది.
బెంగుళూరులో పరిస్థితులపై స్పందించిన అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్.. బెంగుళూరు నగర ప్రతిష్టపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగుళూరుకు.. తాజా వివాదం ఇమేజ్ డ్యామేజీ లాంటిదేనని అభిప్రాయపడ్డారు రావత్. పరిస్థితిని వెంటనే చక్కదిద్ది శాంతి భద్రతలను పునరుద్దరించాలని ఆయన సూచించారు.
ప్రశాంత వాతావరణంలో పనిచేసుకునే ఉద్యోగులంతా.. ఉద్రిక్త పరిస్థితులతో భయాందోళనలకు లోనవుతున్నారని విదేశాల్లోను దీనిపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు రావత్. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించి ఐటీ ఎగుమతులకు అనుకూలంగా ఉన్న బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల ఇమేజ్ దెబ్బ తినకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications