హమ్మయ్యా, ఆ కేసులో మాజీ మంత్రికి బెయిల్, కొడుకు కేసులో తండ్రికి చెమటలు పడుతున్నాయి
కర్ణాటకలోని హోలేనరసీపుర పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగిక వేధింపుల కేసులో మాజీ మంత్రి, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్ డీ. రేవణ్ణకు మరో కేసులో బెయిల్ వచ్చింది. దీంతో మాజీ మంత్రి, జేడీఎస్ నేత హెచ్. డీ రేవణ్ణకు తాత్కాలిక ఉపశమనం లభించింది. బెంగళూరు నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణకు బెయిల్ మంజూరు చేశారు.
రూ 5 లక్షలు బాండ్, ఇద్దరి పూచీకత్తును సమకూర్చమని కోర్టు మాజీ మంత్రి రేవణ్ణకు ఆదేశాలు జారీ చేసింది. హోలెనరసీపుర టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ గృహిణి ఇచ్చిన ఫిర్యాదుతో కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణ, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో రేవణ్ణ మొదటి నిందితుడు. మే 17వ తేదీన మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణ బెంగళూరులోని 42వ ఏసీఎంఎం కోర్టులో లొంగిపోయారు. లైంగిక వేధింపుల కేసులో బెయిల్ కోసం మాజీ మంత్రి రేవణ్ణ దరఖాస్తు చేసుకున్నారు.

పిటిషన్ విచారణ చేసిన కోర్టు రూ. 5 లక్షలు బాండ్, ఇద్దరు పూచీకత్తుల ఆధారంగా మాజీ మంత్రి రేవణ్ణకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేవణ్ణ కోర్టు ముందు లొంగిపోవడంతో ఆయన తరపు న్యాయవాది బెయిల్ దరఖాస్తు దాఖలు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రేవణ్ణ బెయిల్ పిటిషన్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా నిందితులు విచారణకు హాజరుకాలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు.
నిందితుడికి బెయిల్ మంజూరు చెయ్యకుండా అతన్ని పోలీసు కస్టడీ ఇవ్వాలని కోర్టులో వాదించారు. వాదనలు విన్న కోర్టు మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణకు బెయిల్ మంజూరు చేసింది. మైసూరు జిల్లా కే ఆర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్. డీ. రేవణ్ణను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న హెచ్. డీ రేవణ్ణ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications