సీఎం, డీసీఎంకు కోర్టు సమన్లు, లోక్ సభ ఎన్నికల టైమ్ లో యువరాజుకు కోర్టు సమన్లు, అందుకే!
కర్ణాటకలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారని నమోదైన కేసుకు సంబంధించి ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నగరంలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు కావాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ప్రత్యేక కోర్టు మళ్లీ సమన్లు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల షెడ్యూల్ ప్రకారం సీఎం సిద్దరామయ్య మార్చి 28వ తేదీన గురువారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే పోలీసులు సరైన సమయంలో సీఎం సిద్దరామయ్యకు సమన్లు అందజేయకపోవడంతో ఆయన కోర్టు ముందు హాజరు కాలేదు. దీంతో కోర్టు మళ్లీ సమన్లు జారీ చేసి సీఎం సిద్దరామయ్య హాజరుకావడానికి ఒక నెల సమయం ఇచ్చింది. అందువల్ల ఏప్రిల్ 29వ తేదీన సీఎం సిద్దరామయ్య స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ముందు హాజరుకాలేని పక్షంలో సీఎం సిద్దరామయ్య ఆయన న్యాయవాది ద్వారా హాజరు నుంచి మినహాయింపు పొందాలని కోర్టు తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారంటూ కాంగ్రెస్‌పై బీజేపీ ప్రైవేట్ ఫిర్యాదు చేసింది. పిటిషన్ విచారణ చేసిన బెంగళూరులోని 42వ ఏసీఎంఎం కోర్టు మార్చి 28వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రతివాదుల ప్రత్యేక కోర్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లకు సమన్లు జారీ చేసింది.
ఇదే కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే గురువారం కేసు విచారణ జరిగింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నారని, ఆయన కోర్టు ముందు హాజరు కావడానికి సమయం కావాలని ఆయన తరపున న్యాయవాది కోర్టుకు మనవి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం అనుమతించాలని కోరారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి జూన్ 1వ తేదీన రాహుల్ గాంధీ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తరుపున సీనియర్ న్యాయవాది అశోక్ కోర్టులో వాదనలు వినిపించారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, డీకే శివకుమార్‌లకు పోలీసులు ఇంత వరకు సమన్లు జారీ చేయలేదని, పోలీసుల కర్తవ్యం లోపం వలన ఇద్దరు సమన్లు అందుకోలేదని, అందు వలన కోర్టుకు హాజరుకాలేదని కోర్టులో చెప్పారు. ఈ విషయంలో పోలీసుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని న్యాయవాది కోర్టులో వివరించారు. ఈ సమయంలో ఏప్రిల్ 29వ తేదీన సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేస్తూ ప్రత్యేక కోర్టు మరోసారి సమన్లు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పట్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు 40% కమీషన్, ఇతర ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలపై అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ప్రచారం కూడా చేశారు. దీని వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నష్టం వాటిల్లిందని, మాపైన లేనిపోని ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, డీకే శివకుమార్ తదితరులపై ప్రైవేట్ ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications