Bhabanipur Bypoll Result : బైపోల్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి-ఫలితంపై ఉత్కంఠ-గెలిస్తేనే సీఎంగా దీదీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్ ఉపఎన్నిక ఫలితం ఆదివారం(అక్టోబర్ 3) వెలువడనుంది. మమతా బెనర్జీపై బీజేపీ తరుపున ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేశారు. సెప్టెంబర్ 30న ఉపఎన్నిక జరిగింది.దీదీ గెలుపుపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు.50వేల మెజారిటీతో దీదీ విజయం సాధిస్తుందని టీఎంసీ నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే కౌంటింగ్‌కు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ జరిగే ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించారు. 24 కంపెనీల పారామిలటరీ బలగాలను అక్కడ మోహరించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 30న భవానీపూర్ ఉపఎన్నిక జరగ్గా... 53.32 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. భవానీపూర్‌తో పాటే ఉపఎన్నికలు జరిగిన షంషేర్‌గంజ్‌లో 78.60శాతం,జంగీపూర్‌లో 76.12శాతం పోలింగ్ జరిగింది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి శోభన్ దేవ్ చటోపాధ్యాయ్ భవానీపూర్‌లో విజయం సాధించారు.శోభన్ దేవ్‌కు 73,505 ఓట్లు పోల్ అవగా బీజేపీ అభ్యర్థి రుద్రనీల్ ఘోష్‌కు కేవలం 44,786 ఓట్లు పోల్ అయ్యాయి.నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో ఓటమిపాలవడంతో... ఆమె కోసం శోభన్ దేవ్ తన సీటును త్యాగం చేయక తప్పలేదు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆర్నెళ్ల లోపు చట్టసభలకు ఎన్నికవకపోతే పదవిని వదులుకోక తప్పదు. బెంగాల్‌లో శాసనమండలి లేకపోవడంతో దీదీ ఉపఎన్నికకు వెళ్లడం తప్ప మరో మార్గం లేకపోయింది. ఈ నేపథ్యంలో దీదీ భవానీపూర్ నుంచి బరిలో దిగారు. ఈ ఉపఎన్నికలో ఆమె గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోలుగుతారు. దీంతో ఉపఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
భవానీపూర్‌లో దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గతంలో 2011,2016లో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. తాజాగా మరోసారి అక్కడినుంచి పోటీ చేసిన దీదీ... మూడోసారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రియాంక టిబ్రేవాల్ కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భవానీపూర్ ప్రజలు తనను ఆదరిస్తారని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 214 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి తమదే అధికారమని చెప్పిన బీజేపీ 76 స్థానాలకే పరిమితమయింది. అయితే గతంలో కేవలం 3 స్థానాలే ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 76 స్థానాలు సాధించడం విశేషమనే చెప్పాలి. ఎన్నికల్లో ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు.












Click it and Unblock the Notifications