Bhabanipur bypoll result: మమత దూకుడు: కనీసం 50 వేలకు పైగా
కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఊహించినట్టే- మమత బెనర్జీ.. భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. తొలి రెండు రౌండ్లు ముగిసే సరికి ఆమె తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యతను సాధించారు. 3,689 ఓట్ల తేడాతో లీడ్‌లో కొనసాగుతున్నారు.
నందిగ్రామ్‌లో పరాభవం..
ఈ సంవత్సరం నిర్వహించిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ ఓడిపోయిన విషయం తెలిసిందే. తనకు అచ్చి వచ్చిన భవానీపూర్ స్థానం నుంచి కాకుండా నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. మమత బెనర్జీ ఓడిపోయినప్పటికీ- ఆమె సారథ్యాన్ని వహిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు.
భవానీపూర్ బైపోల్ ఎందుకు?
ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా అసెంబ్లీ లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో- మమత బెనర్జీ కోసం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన భవానీపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీనితో ఉప ఎన్నిక అవసరమైంది. తృణమూల్ నుంచి మమత, బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేశారు. గురువారం పోలింగ్ ముగిసింది. భవానీపూర్‌తో పాటు షంషేర్ గంజ్, జంగీపూర్ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించారు. ఈ మూడు చోట్ల కూడా తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగుతోంది.
పోస్టల్ బ్యాలెట్లలోనూ..
ఈ మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కపెట్టారు. ఇందులోనూ మమత బెనర్జీ ఆధిక్యతను కనపరిచారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మమతకు 775 ఓట్ల మెజారిటీ లభించింది. అదే దూకుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లోనూ కనిపించింది. తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోన్నారు. రౌండ్ రౌండ్‌కూ మమత ఆధిక్యత పెరుగుతోంది.
భారీ మెజారిటీ దిశగా..
తొలి రెండు రౌండ్లు ముగిసే సరికి ఆమె 3,689 ఓట్లకు పైగా ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రియాంక టిబ్రేవాల్‌కు 881, సీపీఎం అభ్యర్థి శ్రీజీబ్ బిశ్వాస్‌కు 85 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 21వ రౌండ్లుగా కౌంటింగ్ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి మమత బెనర్జీ కనీసం 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీని సాధిస్తారని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. నందిగ్రామ్‌లో బీజేపీ అక్రమంగా గెలిచిందనే విషయాన్ని భవానీపూర్ ఫలితం స్పష్టం చేస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తోన్నారు.
ఆ మూడు చోట్లా
కాగా- షంషేర్ గంజ్, జంగీపూర్‌లల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. జంగీపూర్‌లో తృణమూల్ అభ్యర్థి జకీర్ హుస్సేన్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆయనకు 1,717 ఓట్ల ఆధక్యత లభించింది. షంషేర్ గంజ్‌లోనూ అధికార పార్టీ అభ్యర్థి అమీరుల్ ఇస్లాం ఆధిక్యతలో ఉన్నారు. ఈ మూడు చోట్ల కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది ప్రారంభం ఫలితాలను బట్టి చూస్తోంటే.












Click it and Unblock the Notifications