Bhagwant Mann : భగవంత్ మాన్ డ్యూటీ మొదలు- పంజాబ్ లో 122 మంది మాజీలకు సెక్యూరిటీ కట్
పంజాబ్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయంతో అధికారం చేపట్టబోతున్న ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అప్పుడే ప్రత్యర్ధుల దుమ్ము దులపడం మొదలుపెట్టేశారు. సీఎంగా పదవీ ప్రమాణం చేయకముందే రాష్ట్రంలో ఉన్న పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రత తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మార్చి 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్.. రాష్ట్రంలోని పలువురు వీవీఐపీలతో సహా 122 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రతను ఉపసంహరించుకోవాలని ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాన్ నిర్ణయం కలకలం రేపుతోంది. ఇందులో పలువురు కాంగ్రెస్, అకాలీదళ్, బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో వీరంతా గగ్గోలు పెడుతున్నారు.

ఇవాళ భగవంత్ మాన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చూస్తే కేంద్ర హోంశాఖ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు భద్రతలో ఉన్న బాదల్ కుటుంబానికి, కెప్టెన్ అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి మాజీ సీఎంలకు మాత్రమే భద్రత కొనసాగించారు. వీరు మినహా మిగిలిన కాంగ్రెస్, అకాలీదళ్, ఇతర నేతలకు ఇచ్చిన భద్రతను తొలగించారు. మరోవైపు పంజాబ్ సీఎంగా నియమితులైన భగవంత్ మాన్ ఇవాళ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలిసిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. మార్చి 16న భగత్ సింగ్ స్వగ్రామం ఖేత్కర్ కలాన్ లో భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వీటితో పాటు తమకున్న ఎమ్మెల్యేల బలం, ఇతర వివరాలను గవర్నర్ కు ఆయన ఇవాళ అందజేశారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాలను గెలుచుకుంది.












Click it and Unblock the Notifications