వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ధర: రాష్ట్రాలకు రూ.600.. ప్రైవేటుకు రూ.1200: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్‌ వ్యాక్సీన్‌

భారత్‌లో ఇస్తున్న రెండు వ్యాక్సీన్లలో ఒకటైన కోవాగ్జిన్ ధరలను భారత్ బయోటెక్ ప్రకటించినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

ప్రముఖ వ్యాక్సీన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ కరోనా నియంత్రణ టీకా 'కోవాగ్జిన్‌' ధరలను ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరు ధరలు నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాకు ఒక్కో డోసు ధర రూ 600లు కాగా.. ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేసే వ్యాక్సీన్‌ ధరను రూ.1200లుగా నిర్ణయించిందని పత్రిక రాసింది.

ఈ మేరకు శనివారం రాత్రి ఆ సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్లు మధ్య ఉంటుందని వెల్లడించింది.

కరోనాను నివారించడంలో కోవాగ్జిన్‌ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు ఇటీవల భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.

మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్ రెండో మధ్యంతర ఫలితాలను బుధవారం వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ టీకా తేలికపాటి, మధ్య స్థాయి, తీవ్రమైన కోవిడ్‌ వ్యాధిపై 78శాతం ప్రభావశీలత కనబరిచిందని తెలిపింది.

దీన్ని తీసుకుంటే తీవ్రమైన కరోనా వ్యాధితో ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు నూరు శాతం లేవని సంస్థ వెల్లడించిందని ఈనాడు వివరించింది.

గాంధీలో గాలి ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో గాలి ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

గాంధీ ఆస్పత్రిలో గాలి ద్వారా నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

అందుకోసం ప్రత్యేకంగా రెండు యంత్రాలను సమకూర్చామని వెల్లడించారు. శనివారం ఆయన కింగ్‌ కోఠి జిల్లా ఆస్పత్రిని సందర్శించారు.

కొవిడ్‌ ఆస్పత్రులను పరిశీలించి కరోనా వారియర్స్‌, వైద్యులతో చర్చించి సలహాలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించడంతో గాంధీ, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో పర్యటిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రి, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల్లో గాలి నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే పరికరాలను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.

ఒక్కో యంత్రం నిమిషానికి 960 నుంచి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. మే మొదటి వారంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి మొదలవుతుందని చెప్పారు.

ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిని నిలిపివేసి, మెడికల్‌ ఆక్సిజన్‌ను 24 గంటల పాటు ఉత్పత్తి చేయిస్తున్నామని చెప్పారు.

వ్యాక్సీన్‌ విషయంలో భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా మిగతా కంపెనీల్లో జాబ్‌ వర్క్‌ చేస్తూ సమాంతరంగా 24 గంటల పాటు ఉత్పత్తి చేసే కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సీన్‌ ఎగుమతులను నిలిపివేసి, దేశ ప్రజలకు ఉపయోగించాలని నిర్ణయించామని చెప్పారు. ఆదివారం మిగిలిన ఆస్పత్రులను పరిశీలించి మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో చర్చించి కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

రాత్రి కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ ప్రారంభం

ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చినట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

కోవిడ్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో శనివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారని సాక్షి రాసింది.

అన్ని కార్యాలయాలు, సంస్థలు, షాప్‌లు.., ఎస్టాబ్లిష్‌మెంట్స్, రెస్టారెంట్లు రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఉదయం 5 గంటల తరువాతనే తెరవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఆస్పత్రులు, డయాగ్నిస్టిక్, ల్యాబ్‌లు, ఫార్మసీ, ఔషధాల అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.

డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది, ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో పనిచేసేవారికి తగిన గుర్తింపు కార్డుతో కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తారు.

గర్భిణులు, రోగులు, వైద్య పరిశీలనలో ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టాండులకు వెళ్లే వారు టికెట్‌ చూపితే మినహాయింపు ఇస్తారు.

ఆంక్షలను ఎవ్వరైనా అతిక్రమిస్తే రాష్ట్ర విపత్తుల నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఆంక్షలను విధిగా అమలు చేయాల్సిందిగా కలెక్టర్లు, ఎస్‌పీలు, పోలీసు కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించిందని సాక్షి వివరించింది.

తెలంగాణ నుంచి అదుబాటులోకి మరో వ్యాక్సీన్

హైదరాబాద్ నుంచి మరో కోవిడ్ టీకా చివరి ట్రయల్స్ దశకు చేరుకుందని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

వ్యాక్సీన్‌ హబ్‌ హైదరాబాద్‌ నుంచి అతి త్వరలో మరో కరోనా టీకా అందుబాటులోకి రానున్నది.

ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించగా.. త్వరలో బయోలాజికల్‌-ఈ (బీఈ) టీకా రానున్నది.

బీఈ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సీన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు శనివారం అనుమతులు వచ్చినట్టు సంస్థ ఎండీ మహిమ దాట్ల తెలిపారు.

గతంలో తాము నిర్వహించిన ఫేజ్‌-1, ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయని చెప్పారు.

టీకా సమర్థంగా పనిచేసిందని, సురక్షితమని నిరూపితమయిందని పేర్కొన్నారు. ఈ ఫలితాలను సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో)కు పంపించామని వివరించారు.

సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (ఎస్‌ఈసీ) వీటిని సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఫేస్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా సూచించిందని చెప్పారు.

ఈ మేరకు సీడీఎస్‌సీవో నుంచి బీఈకి అనుమతులు వచ్చినట్టు వెల్లడించారు. బయోలాజికల్‌-ఈ సంస్థ అమెరికాలోని టెక్సాస్‌ చిల్ట్రన్స్‌ హాస్పిటల్‌ సెంటర్‌, డైనావాక్స్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌తో కలిసి టీకాను అభివృద్ధి చేసింది.

ఈ వ్యాక్సీన్‌ క్యాండిడేట్‌ను 'సీపీజీ 1018టీఎం'గా పిలుస్తున్నారు. గతేడాది నవంబర్‌ రెండోవారంలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించారు.

ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌లో మొత్తం 360 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లపై ప్రయోగాలు జరిపినట్టు సంస్థ తెలిపింది.

వలంటీర్లలో 18- 65 ఏళ్ల మధ్యవారు ఉన్నట్టు పేర్కొన్నది. మొదటి డోస్‌ వేసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోస్‌ వేసినట్టు, వ్యాక్సీన్‌ సురక్షితమైనదిగా, సమర్థమైనదిగా తేలినట్టు పేర్కొన్నదని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bharat Biotech Covaxin Price: Rs.600 to States and Rs.1200 to Private hospitals: Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X