సీడీఎస్‌సీకి పిల్లలపై కోవాగ్జిన్ టీకా ప్రయోగాల డేటా సమర్పించిన భారత్ బయోటెక్
హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పెద్దలకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పిల్లలకు కూడా ఉపయోగించుకునేందుకు ప్రయోగాలు జరుపుతోంది. తాజాగా, చిన్నారుల కోసం రూపొందించిన కోవాగ్జిన్ టీకా ప్రయోగాలను ముగించిన భారత్ బయోటెక్.. ఈ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కి అందజేసింది. ఈ మేరకు వివరాలను భాతర్ బయోటెక్ బుధవారం వెల్లడించింది.
పిల్లలపై రెండు, మూడు దశ ప్రయోగాలు పూర్తి చేసినట్లు గత నెలలోనే సంస్థ ప్రకటించింది. డీసీజీఐ అనుమతి లభిస్తే భారతదేశంలో 18ఏళ్లలోపు వారికి వేసే మొట్టమొదటి టీకా కోవాగ్జిన్ కానుంది. 18ఏళ్లలోపు పిల్లల కోసం రూపొందించిన కోవాగ్జిన్ 2,3 దశల ప్రయోగాలు పూర్తయినట్లు సెప్టెంబర్ నెలలోనే భారత్ బయోటెక్ తెలిపింది. అయితే, సమాచార విశ్లేషణ కొనసాగుతున్నట్లు పేర్కొంది.

సుమారు 1000 మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించినట్లు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటికే 18 ఏళ్లకు పైబడినవారికి కోవాగ్జిన్ టీకా ఉత్పత్తి గణనీయంగా పెంచామని చెప్పారు. ఒకవేళ ఇతర భాగస్వామ్య సంస్థలు కూడా తయారీ ప్రారంభిస్తే నెలకు 10 కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. అయితే, ఇందుకు ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, హెస్టర్ బయోసైన్సెస్ తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
Recommended Video
మరోవైపు, కోవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా(ఈయూఏఎల్)లో చేరాలన్న అంశంపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రపంచ ఆరోగ్యం సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిన విషయం తెలిసిందే. స్వతంత్ర నిపుణుల బృందం వచ్చే వారంలో భేటీ అయి కోవాగ్జిన్ టీకా మూడు దశల క్లినికల్ ట్రయల్స్ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలను సమీక్షించి అత్యవసర వినియోగ జాబితాలోకి చేర్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. అన్ని అనుకున్నట్లు జరిగి కోవాగ్జిన్ అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేరితే ఇక ఇతర దేశాలకు కూడా కోవాగ్జిన్ పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారికి కూడా ఇతర దేశాల్లో ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications