వరవరరావుకు ఊరట: జనవరి 7 వరకు బెయిల్ పొడిగించిన బాంబే హైకోర్టు
ముంబై: భీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. అనారోగ్య కారణాలతో 82 ఏళ్ల వరవరరావు బెయిల్ ను పొడిగిస్తూ వస్తున్న బాంబే హైకోర్టు.. ఆయన విజ్ఞప్తి మేరకు తాజాగా మరోసారి పొడిగించింది.
కొద్ది నెలల నుంచి మెడికల్ బెయిల్ పై ఉన్న వరవరరావు ప్రస్తుతం భార్యతో ముంబైలో ఉన్నారు. స్వరాష్ట్రం తెలంగాణ వెళ్లేందుకు అనుమతిని కోరుతూ కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. వచ్చే ఏడాది(2022) జనవరి 7వ తేదీ వరకు బెయిల్ ను పొడిగిస్తూ జస్టిస్ నితిన్ జామ్ద ార్, జస్టిస్ ఎస్వీ కొత్వాల్ తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఈ బెయిల్ విచారణ సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టులో తన వాదనలు వినిపించింది. వరవరరావును జైలుకు తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. వైద్య చికిత్స అవసరం ఉన్న అనేక మంది వృద్ధులు జైల్లో ఉన్నారని ఎన్ఐఏ తెలిపింది. వరవరరావు ఆరోగ్యంగానే ఉన్నారని నానావతి ఆస్పత్రి నివేదిక తెలిపిందని పేర్కొంది.
80 ఏళ్లకు పైబడినవారిలో వయసుపరమైన సమస్యలుంటాయని, అలాగని బెయిల్ పొడిగిస్తూ వెళ్లకూడదని విన్నవించింది. వైద్య చికిత్స అవసరమున్న చాలా మంది వృద్ధులు జైల్లో ఉన్నారని, వరవరరావు సరెండర్ అయ్యేందుకు ఆదేశాలు ఇవ్వండి అని ఎన్ఐఏ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ బాంబే హైకోర్టును కోరారు.
కాగా, నానావతి ఆస్పత్రి నివేదికను కోర్టుకు ఎన్ఐఏ సమర్పించినప్పటికీ.. వరవరరావు జైలుకు వచ్చే పరిస్థితిలో ఉన్నారా? లేరా? అనే విషయాన్ని తెలుసుకోవాలని ఆయన తరపు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోర్టుకు విన్నవించారు. ఇందుకు అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. డిసెంబర్ 28 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని గ్రోవర్ ను ఆదేశించింది. తదుపరి విచారణను 2022 జనవరి 4కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications