వరవర రావుకు బిగ్ రిలీఫ్: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: 19న మరోసారి
న్యూఢిల్లీ: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు బెయిల్‌కు మరోసారి రిలీఫ్ దక్కింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయన బెయిల్‌ను పొడిగించింది. బెయిల్ పిటీషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఆయన ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పర్మనెంట్ మెడికల్ బెయిల్‌ను మంజూరు చేయాలంటూ వరవర రావు దాఖలు చేసుకున్న పిటీషన్‌ను బోంబే హైకోర్టు ఇదివరకు తిరస్కరించింది. దీనిపై ఆయన ఏప్రిల్ 13వ తేదీన సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు.

భీమా కోరేగావ్ కేసులో..
భీమా కోరేగావ్ కేసులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో ముంబైలోని తలోజా జైలులో గడిపారు. వరవర రావు వయస్సు, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలంటూ మావన హక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు బోంబే హైకోర్టులో పలు పిటీషన్లు వేశారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గత ఏడాది జులైలో ఆయనకు ఆరు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వారికి బెయిల్ లభించడం ఇదే తొలిసారి.

విచారణ ఖైదీగా..
మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారని, ఎల్గార్ పరిషత్, భీమా కోరేగావ్ కేసులో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో వరవర రావును జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. 83 సంవత్సరాల వయోధిక వృద్ధుడైన వరవర రావు ఇదివరకు విచారణ ఖైదీగా ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయనకు కరోనా వైరస్ కూడా సోకింది. నానావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు.

పర్మినెంట్ మెడికల్ బెయిల్ కోసం..
బెయిల్ గడువు ముగిసిన అనంతరం ఆయన తలోజా జైలు అధికారులకు సరెండర్ కావాలంటూ సూచించింది. తాత్కాలిక బెయిల్ గడువు ముగియబోతోండటంతో వరవర రావు బోంబే హైకోర్టులో మరోసారి పిటీషన్ వేశారు. పర్మినెంట్ మెడికల్ బెయిల్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లడానికి అనుమతి కావాలని కోరారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని, దీనికోసం తాత్కాలిక బెయిల్ పిటీషన్‌ను మూడు నెలల పాటు పొడిగించాలని విన్నవించారు.

తిరస్కరించిన బోంబే హైకోర్టు..
దీన్ని బోంబే హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ గడువును పొడిగించలేమంటూ స్పష్టం చేసింది. దీనితో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ఇవ్వాళ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వరవర రావు తరఫున సీనియర్ అడ్వొకేట్ ఆనంద్ గ్రోవర్, ఎన్ఐఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు.

సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు..
భీమా కోరేగావ్ కేసులోనే అరెస్టయిన గిరిజన హక్కుల పోరాట కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి గత ఏడాది జులైలో పోలీసుల కస్టడీలో మరణించారని ఆనంద్ గ్రోవర్ గుర్తు చేశారు. అనంతరం ధర్మాసనం వరవర రావు తాత్కాలిక బెయిల్‌ను పొడిగించడానికి అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications