Delhi Metro: కొత్తగా 13 మెట్రో స్టేషన్స్.. కేబినెట్ ఆమోదం..
దేశంలోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో దేశ రాజధాని దిల్లీ ఒకటి. మరోవైపు కాలుష్య కోరల్లో చిక్కుకున్న ప్రధాన పట్టణంగా దిల్లీ ఉంది. వాహనాలు, ఇండస్ట్రీస్ సంఖ్య పెరిగిన నేపథ్యంలో దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం అయింది. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ మెట్రో ఫేజ్ 5A ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మూడేళ్లలో రూ. 12,015 కోట్ల అంచనా వ్యయంతో 16 కిలోమీటర్ల కొత్త మార్గాన్ని, 13 కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ విస్తరణతో దిల్లీ మెట్రో నెట్‌వర్క్ మొత్తం పొడవు 400 కిలోమీటర్ల మార్కును అధిగమిస్తుంది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ప్రకారం.. ఫేజ్ 5A కింద నిర్మించే మొత్తం 13 స్టేషన్లలో, పది భూగర్భంలో ఉండగా, మూడు ఎలివేటెడ్ గా ఉంటాయి. ఈ అదనపు మార్గాలు రాజధానిలో రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి.
కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ ఫేజ్ 5Aలో మూడు వేర్వేరు కారిడార్లను ఉన్నాయి.. రామకృష్ణ ఆశ్రమం మార్గ్ నుండి ఇంద్రప్రస్థ వరకు 9.9 కిలోమీటర్లు (రూ. 9,570.4 కోట్లు), ఏరోసిటీ నుండి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1 వరకు 2.3 కిలోమీటర్లు (రూ. 1,419.6 కోట్లు), అలాగే తుగ్లకాబాద్ నుండి కాలింది కుంజ్ వరకు 3.9 కిలోమీటర్లు (రూ. 1,024.8 కోట్లు).
ఈ కొత్త కారిడార్లు జాతీయ రాజధానిలోని రద్దీ ప్రాంతాలలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అవి రోడ్డు రద్దీని తగ్గించడమే కాకుండా, కీలకమైన నివాస, వాణిజ్య, రవాణా కేంద్రాలకు లాస్ట్-మైల్ యాక్సెస్‌ను బలోపేతం చేస్తాయి.
మరోవైపు, దిల్లీ మెట్రో ఫేజ్ 4లోని సాకేత్ G బ్లాక్- లజ్ పత్ నగర్ మార్గంలో నిర్మాణ పనులు ఈ నెల ప్రారంభమయ్యాయి. సాకేత్ సమీపంలోని పుష్ప భవన్ వద్ద ఎలివేటెడ్ గోల్డెన్ లైన్ (లైన్-11) కోసం భూమి పూజ, తొలి టెస్ట్ పైలింగ్ కార్యక్రమాలతో దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించింది.

ఈ కారిడార్ 2029 నాటికి పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 8 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త మార్గం సాకేత్ G బ్లాక్ వద్ద ఐజీఐ ఎయిర్‌పోర్ట్- తుగ్లకాబాద్ కారిడార్ నుండి విడిపోతుంది. ఈ మార్గంలో లజ్‌పత్ నగర్, ఆండ్రూస్ గంజ్, గ్రేటర్ కైలాష్-1, చిరాగ్ దిల్లీ, పుష్ప భవన్, సాకేత్ డిస్ట్రిక్ట్ సెంటర్, పుష్ప్ విహార్, సాకేత్ G బ్లాక్ అనే ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి.












Click it and Unblock the Notifications