నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళన: ఎంపీల కంటే ప్రజలే నయమన్న స్పీకర్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పెద్ద నోట్లపై ప్రతిపక్షాలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. గురువారం రాజ్యసభలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళనలకు దిగడంతో రాజ్యసభ వాయిదా పడింది. మళ్లీ అరగంటకు ప్రారంభమైనా పోడియం వద్ద నినాదాలతో ఆందోళన చేయడంతో మరోసారి మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం విపక్షాల ఆందోళతోనే సభ జరుగుతోంది.
నోట్ల రద్దు అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం తెలిపింది. కాగా, లోకసభలో కూడా ప్రతిపక్షాలు పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకే ఇబ్బందులని విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. నోట్ల రద్దుపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు.
కాగా, లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ విపక్షాల డిమాండ్‌ను తిరస్కరించి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీంతో కాంగ్రెస్, టీఎమ్‌సీ, ఎస్పీ, ఆర్జేడీ, ఏఐఏడీఎమ్‌కే, ఇతర పార్టీల సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పలుమార్లు సభను వాయిదా వేసినప్పటికీ లాభం లేకపోవడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

ప్రజలే నయం
పెద్దనోట్ల రద్దు, నగదు మార్పిడిపై చర్చ చేపట్టాలని.. చర్చ జరిగే సమయంలో ప్రధాని మోడీ సభలో ఉండాలని.. చర్చ అనంతరం మోడీ మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. నోట్ల రద్దుపై కేంద్రం చర్చకు సిద్ధంగా ఉందని.. ఆర్థిక పరమైన అంశాలకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమాధానాలు ఇస్తారని స్పీకర్ తెలిపారు. అయినప్పటికీ సభ్యులు శాంతించక.. స్పీకర్ పోడియం వద్ద 'మోడీ సభకు రావాలి- జవాబు చెప్పాలి' అంటూ నినాదాలు చేశారు.
నోట్ల రద్దుపై ఓటింగ్ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ.. రూల్ 193 ప్రకారం ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, ఓటింగ్ అవసరం లేదని తెలిపారు. రూల్ 56 ప్రకారం మేము నోట్ల రద్దుపై చర్చ కోరుతున్నామని, అన్ని పార్టీలు ఓటింగ్ నిర్వహించాలని కోరుతున్నాయని, ప్రతి సభ్యుడు ఓటింగ్‌లో పాల్గొంటారని కాంగ్రెస్ సభ్యులు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
నోట్ల మార్పిడితో ప్రజలు పడుతున్న కష్టాలు, ఆర్థిక పరిస్థితి, నోట్ల మార్పిడిలో ప్రభుత్వ విఫలం తదితర అంశాలపై చర్చ చేపట్టాలంటూ ఖర్గే కోరారు. అలాగే నోట్ల మార్పిడి అంశం పలువురికి ముందే తెలుసున్న అంశంపై కూడా తాము చర్చ చేపట్టాలని కోరుతున్నట్లు ఖర్గే స్పీకర్‌కు తెలిపారు.
సభలో విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల కంటే సామాన్య ప్రజలే నయమని...బ్యాంకుల దగ్గర క్రమశిక్షణతో క్యూ కట్టారంటూ ఆందోళన చేస్తున్న ఎంపీలపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.
ప్రశ్నోత్తరాలు
ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని 44, 163 నెంబరు జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలపై రక్షణ చర్యలు చేపట్టాలని టిఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, నర్సయ్య గౌడ్ రహదారుల మంత్రిత్వ శాఖను కోరారు. అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని.. అండర్‌పాస్, బైపాస్ రోడ్లు నిర్మించి ప్రమాదాల నివారణకు చర్చలు తీసుకోవాలని రహదారుల మంత్రిత్వ శాఖను కోరగా.. ఏయే రహదారులపై సమస్యలున్నాయో గుర్తించి నివేదిక అందిస్తే... వచ్చే రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని కేంద్ర రహదారుల శాఖ సహాయమంత్రి మన్‌సుఖ్ మండవ్యా వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications