దేశాన్ని బెంబేలెత్తిస్తోన్న కరోనా మరణాలు: ఒక్కరోజే 1133 మంది వైరస్ కాటుకు బలి: కేసులు కాస్త తగ్గినా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ గంటగంటకూ చెలరేగిపోతోంది. భీకరంగా విస్తరిస్తోంది. రికార్డుస్థాయిలో 90 వేలకు పైగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా మరణాల్లోనూ అదే స్థాయిలో ఉధృతి కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 1133 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. ఈ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. అన్‌లాక్-4 అమల్లోకి వచ్చిన తరువాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలోనూ భారీగా పెరుగుదల నమోదవుతోంది. దీనికి అనుగుణంగా మరణాలు నమోదు కావడం పట్ల అధికారులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 75,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే.. ఈ సంఖ్య కాస్త తక్కువే. రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయే తప్ప ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. 1133 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 42,80,423కు చేరుకుంది. ఇప్పటిదాకా 72,775 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,83697కు చేరుకుంది. 33,23,951 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్‌ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు.

దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి సోమవారం వరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య అయిదు కోట్ల మార్క్‌ను అధిగమించింది. ఇప్పటిదాకా 5,06,50,128 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. సోమవారం ఒక్కరోజులో 10,98,621 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications