ఏఏపీకి అతిపెద్ద ముప్పు ఎక్కడి నుండి? అరవింద్ కేజ్రీవాల్ తొలగింపు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పు బీజేపీ నుండో లేక కాంగ్రెస్ పార్టీ నుండో లేదని, స్వయంగా ఆ పార్టీ నుండే ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏపీ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది.
అయితే, రెండు మూడు రోజులుగా ఆ పార్టీలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముసలం పుట్టడం గమనార్హం. ఈ ముసలాన్ని చూస్తుంటే ఏఏపీకి ఏఏపీయే శత్రువు అని, ఆ పార్టీకి ఆ పార్టీలోనే ముప్పు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఎలా ప్రారంభమైంది?
ప్రశాంత్ భూషణ్ రాసిన లేఖ ద్వారా మొదట ఏఏపీలో సంక్షోభం ప్రారంభమైంది. పార్టీలో పారదర్శకత ఉండాలని ఆయన లేఖ రాసిన లేఖ సంచలనమైంది. ఏఏపీ ఒకే పార్టీ చుట్టు తిరుగుతోందని ఆయన తన లేఖలో ఆరోపించారు. పార్టీలో 'స్వరాజ్' బంధీ అయిందని పేర్కొన్నారు. వారం రోజుల క్రితం పార్టీ అంతర్గత లోక్‌పాల్‌కు రాసిన లేఖలో మహిళలకు ప్రాధాన్యతను ప్రశ్నించారు.
దీనిపై అంతర్గాత లోక్‌పాల్ స్పందిస్తూ.. అగ్రనాయకత్వం మధ్య సమాచారలోపం, పరస్పర అపనమ్మకం మంచిది కాదని సూచించారు.
అదే సమయంలో పార్టీ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌ను తొలగిస్తారని వార్తలువచ్చాయి. దీని పైన యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ.. వాటిని కొట్టి పారేశారు. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని చెప్పారు.

ఇదే మొదటిసారి కాదు..
ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గతంగా విభేదాలు రావడం ఇదే మొదటిసారి కాదని చెప్పవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కేజ్రీవాల్ పైన అసంతృప్తితో మాజీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బీజేపీలో చేరారు. అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దాంతో అతను బీజేపీలో చేరారు.
ఆ తర్వాత షాజియా ఇల్మీ కూడా పార్టీ అధినాయకత్వంతో విభేదించి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ పార్టీని వీడిన సమయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఏపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు.
ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో కేజ్రీవాల్ పైన ఆ పార్టీ సీనియర్ నేత శాంతిభూషణ్ కూడా విమర్శలు చేశారు. దేశంలో క్లీన్ పాలిటిక్స్ తీసుకు రావాలన్న పార్టీ ప్రాథమిక సిద్ధాంతాన్ని కేజ్రీవాల్ విస్మరించారని ఆరోపించారు. ఏఏపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నారు.
ఏఏపీకి ముప్పు బీజేపీ వల్ల కాదు...
ఏఏపీ పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీకి అతిపెద్ద ముప్పు బీజేపీ లేదా మరే ఇతర పార్టీ వల్ల లేదని, ఆ పార్టీలోనే ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కేజ్రీవాల్ తొలగింపు!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శిగా రెండు పదవుల్లో కేజ్రీవాల్ కొనసాగడంపై పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో.. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. గత వారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేజ్రీవాల్ రాజీనామా సమర్పించారు.
కేజ్రీవాల్ రాజీనామాను ఉపసంహరించుకోవాలని కొందరు, ఆయన బదులు మరొకరిని నియమించాలని మరికొందరు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో కేజ్రీవాల్‌ను తొలగించినట్లు అదికారిక ప్రకటన చేసి, కొత్త కార్యదర్శిని ఎంపిక చేయవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications