ఎన్డీయేకు నితీశ్ కుమార్ గుడ్ బై ? రేపు ప్రకటన-సోనియాతో భేటీకి ప్లాన్-యూపీఏలోకి ఎంట్రీ ?
బీహార్లో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్న బీజేపీ-జేడీయూ మధ్య తలెత్తిన విభేదాలు నితీశ్ ప్రభుత్వానికి శాపంగా మారాయి. దీంతో బీజేపీకీ, ఎన్డీయేకు గుడ్ బై చెప్పేందుకు నితీశ్ సిద్దమవుతున్నారు. రేపు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్న నితీశ్.. అనంతరం కీలక ప్రకటన చేయబోతున్నారు. అనంతరం ఆయన సోనియా గాంధీతో సమావేశమై యూపీఏ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.

రసకందాయంలో బీహార్ రాజకీయం
బీహార్ లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న నితీశ్ కుమార్ మళ్లీ అలిగారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కొంతకాలంగా దూరంగా ఉంటున్న నితీశ్ కుమార్.. నిన్న జరిగిన నీతి ఆయోగ్ భేటీకి కూడా వెళ్లలేదు. ఇప్పటికే తాజాగా నాలుగుసార్లు కేంద్రం నిర్వహించిన సమావేశాలకు డుమ్మా కొట్టిన నితీశ్ కు కేంద్రం కూడా అంతే స్దాయిలో షాకులిస్తోంది. తాజాగా బీహార్ ను ఉగ్రవాద అడ్డాగా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం చేసిన ప్రకటన నితీశ్ కు మంటపుట్టించింది. దీంతో ఆయన ఇక ఎన్డీయేను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్డీయేకు నితీశ్ గుడ్ బై
జేడీయూకు చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలతో నితీశ్ కుమార్ రేపు కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో బీజేపీ గురించి తన అభిప్రాయాల్ని ఎంపీలు, ఎమ్మెల్యేలకు వివరించనున్న నితీశ్.. ఎన్డీయేకు గుడ్ బై చెప్పాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. దీంతో ఈ భేటీ కీలకంగా మారింది. తమ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ ను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా జేడీయూను చీల్చాలని బీజేపీ చూస్తుందనే ఆరోపణను నితీశ్ ప్రధానంగా తెరపైకి తెచ్చే అవకాశముంది. ఈ భేటీ తర్వాత నితీశ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్డీయేకు గుడ్ బై నిర్ణయం ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రేపు బీహార్ లో అన్ని పార్టీలతో కలిసి నితీశ్ అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించబోతున్నారు. దీనిపైనా ఆసక్తి నెలకొంది.

సోనియాతో భేటీ-యూపీయేలో చేరిక ప్లాన్ ?
నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, విపక్ష తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్‌లతో కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఎమ్మెల్యేలెవరూ మధ్యంతర ఎన్నికలు కోరుకోవడం లేదని, అందుకే కొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు జేడీయూ సంకేతాలు ఇస్తోంది. అలాగే ఎన్డీయేకు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించిన తర్వాత నితీశ్ కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కానున్నారు. ఇప్పటికే నితీశ్.. సోనియా అపాయింట్ మెంట్ కూడా కోరారు. ఈ భేటీ తర్వాత నితీశ్.. యూపీయేలో చేరబోతున్నట్లు ప్రకటించే అవకాశముంది.












Click it and Unblock the Notifications