సర్వే రిపోర్ట్ షాక్.. ఆర్జేడీ ఎమ్మెల్యేల్లో డజనుకు పైగా టికెట్లు కట్!
Bihar Election 2025: బీహార్లో ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఏ కూటమిలోనూ సీట్ల పంపకంపై తుది నిర్ణయం జరగలేదు. కానీ అంతర్గతంగా ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్(RJD) పార్టీ తమ ప్రస్తుత శాసనసభ్యుల్లో డజనుకు పైగా అభ్యర్థుల టికెట్లను నిరాకరించాలని నిర్ణయం తీసుకుంది.
తేజస్వి యాదవ్ కీలక నిర్ణయం
తేజస్వి యాదవ్ తన నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో వరుసగా సమావేశమై ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వే రిపోర్టు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి అత్యధికంగా కైమూర్ జిల్లాకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేల పేర్లు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎవరికి టికెట్లు నిరాకరిస్తారు?
ఆర్జేడీ వర్గాల సమాచారం ప్రకారం..ఈ కారణాల వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉంది. పార్టీ చేయించిన సర్వే రిపోర్ట్‌లో ఎవరికైతే సంతృప్తికరమైన ఫీడ్‌బ్యాక్ లభించలేదో, వారికి మళ్లీ అవకాశం ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించింది. తమ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్ ఇవ్వరు. వయసు పైబడిన ఎమ్మెల్యేలకు కూడా ఈసారి టికెట్ నిరాకరించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. చాలాసార్లు గెలిచిన కొంతమంది సీనియర్ నాయకుల టికెట్‌పై కూడా ఈసారి కత్తి వేలాడుతోంది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు.
అభ్యర్థులకు సంకేతాలు
ఆర్జేడీ అధిష్టానం శుక్రవారం రోజున కొంతమంది అభ్యర్థులను సమావేశానికి పిలిచింది. సీట్ల పంపకం ఖరారైన తర్వాతే పేర్లను ప్రకటిస్తారు. అయితే ఎంపికైన అభ్యర్థులకు తమ సన్నాహాలు ప్రారంభించాలని పరోక్షంగా సంకేతాలు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహాకూటమిలో సీట్ల పంపకంపై సోమవారం తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆర్జేడీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
ఎక్కడ ఎక్కువ టికెట్లు కట్ అవుతాయి?
ఆర్జేడీ వర్గాల ప్రకారం.. పార్టీకి గట్టి పట్టున్న మగధ్ ప్రాంతంలో మాత్రం అతి తక్కువ మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. పనితీరు సగటు కంటే తక్కువగా ఉన్న అభ్యర్థులకు మాత్రమే అక్కడ టికెట్లు నిరాకరిస్తారు.అయితే ముఖ్యంగా కైమూర్ జిల్లాలో పార్టీ అత్యధిక అభ్యర్థులను మార్చాలని యోచిస్తోంది. కైమూర్, భోజ్‌పుర్, మగధ్ ప్రాంతాలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇటీవల ఎన్డీఏ కూటమి క్రియాశీలతను దృష్టిలో ఉంచుకుని, ఆర్జేడీ ప్రతి సీటుపై సుదీర్ఘ చర్చలు జరిపి ఈ నిర్ణయాలు తీసుకుంది.












Click it and Unblock the Notifications