‘ఇందిరా గాంధీ పాలన బ్రిటిష్ కన్నా దారుణం’
పాట్నా: బ్రిటీష్ హయాం కన్నా ఇందిరా గాంధీ పాలనే దారుణంగా ఉండేదని బీహార్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక వెబ్‌సైట్ పేర్కొంది. కాగా, ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ మారి కలకలం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్.. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీహార్ చరిత్రకు సంబంధించి రాసిన వ్యాఖ్యానంలో ఇందిరా గాంధీ ‘నియంతృత్వ పాలన', ఎమర్జెన్సీ కాలంలో పాల్పడ్డ ‘అణచివేత'ను ఈ వెబ్‌సైట్‌లో ప్రస్తావించారు. ఆధునిక చరిత్రలో జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రను కూడా ప్రస్తావించారు.
ఈ క్రమంలో ‘ఇందిరా గాంధీ, ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ సాగించిన నియంతృత్వ పాలనను జేపీ గట్టిగా వ్యతిరేకించారు. దీనిపై వ్యక్తమయ్యే ప్రజా స్పందనకు భయపడ్డ ఇందిరా గాంధీ.. 1975 జూన్ 26న దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ జేపీని అరెస్టు చేసింది. కరుడుగట్టి నేరగాళ్లను ఉంచే తీహార్ జైల్లో ఆయనను నిర్బంధించింది' అని వెబ్‌సైట్ పేర్కొంది.

అంతేగాక, ‘నెహ్రూతో కలసి స్వాతంత్య్ర పోరాటం చేసిన జేపీకి.. 1917లో చంపారన్‌లో బ్రిటిష్ వారి చేతిలో మహాత్మా గాంధీకి ఎదురైన దానికన్నా చేదు అనుభవం ఎదురైంది' అని వ్యాఖ్యానించింది.
కాగా, ఈ తరహా వ్యాఖ్యానాలు తమకు ఆమోదయోగ్యం కాదని బీహార్ కాంగ్రెస్ నేత చందన్ యాదవ్ తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వద్ద లేవనెత్తుతామని చెప్పారు. వెబ్‌సైట్‌లో ఉంచిన ‘ఇందిరా కథనం'ను పరిశీలిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా, అధికారులు ఇందిరా గాంధీపై వచ్చిన కథనాన్ని విమర్శల నేపథ్యంలో తొలగించేశారు.












Click it and Unblock the Notifications