సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం: రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు..
Bilkis Bano case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు- గుజరాత్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం జైలు నుంచి విముక్తి కల్పించడాన్ని నిరసిస్తూ ఉద్యమిస్తోన్న వారికి ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
2002లో గోధ్రా రైలు దగ్ధం అనంతరం గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె అయిదు నెలల గర్భిణి. ఆమె మూడేళ్ల కుమార్తె సహా ఏడుమంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు దారుణంగా హతమార్చాయి. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి.

ఈ కేసులో శిక్షను అనుభవిస్తోన్న వారిని 2002లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడిచిపెట్టింది. స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో దోషులైన 11 మందిని సత్ప్రవర్తన కింద విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం.
రాధేశ్యామ్ షా, జశ్వంత్ చతుర్ భాయ్, కేశూభాయ్ వడానియా, బాకాభాయ్ వడానియా, రాజీభాయ్ సోని, రమేష్‌భాయ్ చౌహాన్, శైలేష్ భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్‌భాయ్, మహేష్ భట్, ప్రదీప్ మోధియా విడుదల అయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని గుజరాత్ ప్రభుత్వం- వారిని సత్ప్రవర్తన గల ఖైదీలుగా గుర్తించి విడుదల చేసింది.
గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అత్యంత దారుణకాండకు పాల్పడిన వారిని స్వేచ్ఛాయుత సమాజంలో విడిచి పెట్టడాన్ని స్వాగతించట్లేదంటూ పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. ఈ విషయంపై అటు పౌర సమాజం కూడా కదిలింది.

గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేయాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆరువేల మందికి పైగా రిటైర్డ్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వేర్వేరు శాఖల్లో పని చేస్తోన్న ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, చరిత్రకారులు, ఫిల్మ్‌మేకర్స్, జర్నలిస్టులు, మహిళా సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటీషన్లను దాఖలు చేశారు.
దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. తాజాగా తీర్పు వెలువడించింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం సరికాదని తెలిపింది. దీనికి సంబంధించిన ఆదేశాలను కొట్టివేసింది.
ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తుది తీర్పు ఇచ్చింది. ఫలితంగా ఆ 11 మంది కూడా మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే వారు పోలీసులు లేదా న్యాయస్థానం ముందు సరెండర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications