చైనా పార్టీపై బీజేపీ కన్ను!: టీలో దూకుడు, బాబుకు అమిత్ అధికార షాక్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రధాని నరేంద్ర మోడీ హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కన్ను చైనా కమ్యూనిస్ట్ పార్టీ పైన పడింది!
దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదును పది కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రపంచ రికార్ట్ సృష్టించాలనుకుంటోంది. చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటి వరకు ఆ రికార్డ్ కలిగి ఉంది. ఆ పార్టీకి 6.48 కోట్ల మెంబర్‌షిప్ ఉంది. పది కోట్ల మెంబర్ షిప్ ద్వారా దానిని బీట్ చేయాలని చూస్తోంది.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన అమిత్ షా ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు పైనే దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని 35 లక్షలుగా పెట్టారు. అలాగే, మిత్రపక్షం తెలుగుదేశం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోను పెద్ద మొత్తంలోనే టార్గెట్ పెట్టుకున్నారు.
ఇరు రాష్ట్రాల్లోని పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేశారు. రాబోవు 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి రావాలని రెండు రాష్ట్రాల్లోను ఆ దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని అమిత్ షా సూచించారు. ప్రతి పోలీంగ్‌బూత్‌కు వంద మందిని చేర్చించాలన్నారు.
రెండు రాష్ట్రాల్లోను అధికారం చేపట్టే దిశగా సాగాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. తద్వారా తమ మిత్రపక్షం టీడీపీకి ఆయన గట్టి షాక్ ఇచ్చినట్లుగానే భావిస్తున్నారు. తెలంగాణ విషయంలో అమిత్ షా లేదా బీజేపీ కొంత దూకుడుగా ఉంది.

ఇక్కడ తెరాస అధికారంలో ఉంది. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ తెలంగాణలో దానిని పక్కన పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో కాకుండా.. సొంతగా వెళ్దామని స్థానిక బీజేపీ నేతలు కూడా చెప్పడంతో.. అమిత్ షా అందుకు అంగీకరించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నందున దూకుడుగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీకి బీజేపీతో దోస్తీ అవసరమనే చెప్పవచ్చు. అదే సమయంలో దూకుడుగా వ్యవహరించి టీడీపీతో దోస్తీని కట్ చేసుకోవాలని బీజేపీ కూడా ఆలోచించడం లేదు.
ఏపీలో పార్టీ బలోపేతం పైన బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. టీడీపీకి నష్టం కలిగించకుండా తమ పార్టీని బలోపేతం చేస్తామని అమిత్ షా చెప్పారు. తద్వారా కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నుండి చేరికలు బీజేపీలోకే ఎక్కువగా ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ నుండి.
అలా చేరినప్పటికీ 2019 నాటికి బీజేపీ టీడీపీకి ధీటుగా బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో మంత్రి, బీజేపీ నేత మాణిక్యాల రావు మాట్లాడుతూ.. టీడీపీలో ఉంటే బీజేపీలో సభ్యత్వం ఇవ్వమని చెప్పారు. కానీ, ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వచ్చినప్పటికీ ఐదేళ్ల తర్వాత బాబుకు బీజేపీ మేకు అయ్యేలా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications