ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు: గోవాకు బీజేపీ వరాల జల్లు
పనాజీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఇక ఫిబ్రవరి 10వ తేదీన ఉత్తర్ ప్రదేశ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఇక తొలి విడత ఎన్నికలకు ప్రచారం నేటితో ముగియనుంది. గోవా అసెంబ్లీకి ఎన్నికలు ఫిబ్రవరి 14వ తేదీన జరగనున్నాయి. దీంతో గోవా ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇంతకీ బీజేపీ మేనిఫెస్టోలో ఏమున్నాయి... ప్రజలను ఆకట్టుకునే మేనిఫెస్టోనా కాదా..?
గోవా అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. గోవాలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొంది. పెట్రోల్ డీజిల్‌పై విధిస్తున్న రాష్ట్ర సుంకాన్ని మూడేళ్ల పాటు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అంతేకాదు అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోగా గోవా మైనింగ్ ఇండస్ట్రీని పునఃప్రారంభిస్తామని వెల్లడించింది. మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ... గోవాలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గోవాను బీజేపీ సర్కార్ అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రజలు తిరిగి కమలం పార్టీకే పట్టం కడతారని చెప్పారు.

గోవాలో పెట్రోల్ డీజిల్ ధరలు రూ.80 కంటే ఎక్కువగా పెంచమని చెప్పిన కాంగ్రెస్ పై నితిన్ గడ్కరీ నిప్పులు చెరిగారు. ఇంధనంపై నడిచే వాహనాలు ఇక ఫేడ్ అవుట్ అవుతున్నాయని రానున్న రోజుల్లో విద్యుత్ వాహనాలదే హవా అని నితిన్ గడ్కరీ కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు. సహజ వాయువు, బ్లెండెడ్ ఫ్యూయల్‌తో నడిచే వాహనాల గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ నేచురల్ గ్యాస్ ,బ్లెండెడ్ ఫ్యూయల్ తక్కువ ధరకే లభిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో తయారయ్యే వాహనాలు ఇటు ఇంధనంతో అటు బయో ఫ్యూయల్‌తో నడిచేలా తయారవుతాయని చెప్పారు. టయోటా లాంటి వాహనాలు ఫ్లెక్స్ ఇంజిన్‌లతో తమ వాహనాలను తయారు చేస్తామని చెప్పాయని వెల్లడించారు. ఇలా వచ్చాయంటే కాంగ్రెస్ చెబుతున్నట్లుగా ఇంధనం ధరలు రూ.80కి తగ్గిస్తామని చెప్పడంలో అర్థం లేదని అన్నారు.డీజిల్ వాహనాలు సీఎన్‌జీ వాహనాలుగా మారుస్తామని ఇకపై గోవా కాలుష్య రహిత రాష్ట్రంగా ఎదుగుతుందని చెప్పారు. సీఎన్‌జీ లీటరుకు రూ.40 ఖర్చు అవుతుందని కాంగ్రెస్ మాత్రం ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
గోవా పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న నేపథ్యంలో ఇక్కడ విద్యుత్ బస్సులు, టాక్సీలను పెంచుతామని చెప్పారు. గోవాలో ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇక గృహ రుణాలు కూడా తక్కువ వడ్డీకే ఇస్తామని చెప్పుకొచ్చారు. మహిళలకు 2శాతం, పురుషులకు 4శాతం వడ్డీతో గృహ రుణాలు మంజూరు చేస్తామని వెల్లడించారు. మనోహర్ పారిక్కర్ కల్యాణ్ పథకం ద్వారా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి అక్కడి వనరులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక పర్యాటక రంగంకు కూడా వరాలు ప్రకటించింది బీజేపీ. హోమ్ స్టే పథకం ద్వారా గోవా నివాసితులకు వడ్డీ లేకుండా రూ.5 లక్షలు రుణాలు ఇస్తామని చెప్పారు. పర్యాటకులకు హోమ్‌స్టే సదుపాయం కల్పించాలని భావిస్తున్న వారికి ఈ రుణాలు ఇస్తామని వెల్లడించారు.
ఇక యువతకు కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో వరాలు కురిపించింది. మిషన్ గోల్డ్ కోస్ట్ స్కీమ్ ద్వారా గోవా యువత ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించేందుకు శిక్షణ ఇప్పిస్తామని పేర్కొంది. అంతేకాదు సరికొత్త అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టేడియం సైతం నిర్మిస్తామని వెల్లడించింది.ఓ అంతర్జాతీయ కోచ్‌ను ఏర్పాటు చేసి ఫుట్‌బాల్ క్రీడాకారులకు శిక్షణ ఇప్పించే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుందని మేనిఫెస్టోలో పొందుపర్చారు. రానున్న కొన్నేళ్లలో ఫిఫా-అండర్ -20 ప్రపంచ కప్‌ను గోవా వేదికగా జరిగేలా ప్రయత్నిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.












Click it and Unblock the Notifications