జగన్ సర్కార్‌పై కాంగ్రెస్ సానుభూతి..!!
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి.
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరప్పతో కలిసి మాట్లాడారు. బీజేపీకి రాజీనామా చేసిన గోవిందరాజనగర, రాజరాజేశ్వరినగర, విజయనగర నియోజకవర్గాలకు చెందిన నాయకులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ- ఈ ఎన్నికల్లో తమను గెలిపించకపోతే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటామంటూ బీజేపీ నాయకులు కర్ణాటక ప్రజలను బెదిరిస్తోందని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, తాము కాకుండా మరే ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా కర్ణాటక తీవ్రంగా నష్టపోతుందంటూ హెచ్చరిస్తోన్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులు ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు.
కర్ణాటక మాత్రమే కాకుండా.. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలపైనా బీజేపీ అధిష్ఠానం ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడుతోందంటూ డీకే శివకుమార్ ఆరోపించారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే.. ఇలా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ హైకమాండ్ బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ నిప్పులు చెరిగారాయన.

కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు కర్ణాటకలో వేలాదిమంది మృత్యువాత పడితే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమైందని ప్రశ్నించారు డీకే శివకుమార్. దేశంలోనే అత్యధిక కోవిడ్ మరణాలు నమోదైన మెట్రో నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారనే కారణంతో వ్యక్తిగతంగా, రాజకీయంగా తనపై కక్షసాధింపు చర్యలకు బీజేపీ నాయకులు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ విషయంపై తాను హైకోర్టును ఆశ్రయించానని, న్యాయ వ్యవస్థ పట్ల తనకు విశ్వాసం ఉందని డీకే శివకుమార్ అన్నారు. చివరి వరకూ పోరాడతానని స్పష్టం చేశారు. కోర్టులు న్యాయం వైపే నిల్చుంటాయని, అన్యాయం చేయవని బలంగా నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ బీజేపీ నాయకులు పెట్టిన కేసులన్నీ అక్రమమైనవేనని, రాజకీయ కక్షసాధింపు చర్యేనని అన్నారు.












Click it and Unblock the Notifications