గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ : విజయ్ రూపానీ ప్రతిపాదన-రేపే ప్రమాణ స్వీకారం..!!
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. తాజా-మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం సమావేశం అయింది. కేంద్ర మంత్రులు తోమర్..ప్రహ్లాద్ జోషీ కేంద్ర పార్టీ ప్రతినిధులుగా హాజరయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తిరిగి పటేల్ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్ పేరును ఏకగ్రీవంగా ఖరారు చేసారు. ఆయన గతంలో ఆనందిబెన్ ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
విజయ్ రూపానీ పైన వ్యతిరేకత పెరగటం..కరోనా సమయంలో విమర్శలు రావటంతో పాటుగా గుజరాత్ లో మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా రూపానీతో బీజేపీ అధినాయకత్వం రాజీనామా చేయించింది. కొత్త సీఎంను నియమించి ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రూపానీ రాజీనామా...భూపేంద్ర పటేల్ కొత్త సీఎంగా ఎంపిక కార్యక్రమం పూర్తయింది. పార్టీ నేతలతో కలిసి భూపేంద్ర పటేల్ గవర్నర్ ను కలవనున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేయనున్నారు. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఆయన లక్షా వేల కోట్ల మెజార్టీతో గెలుపొందారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. కేంద్ర మంత్రులతో పాటుగా రాష్ట్రానికి చెందిన పలువురి పేర్లు కొత్త సీఎం రేసులో ఉన్నట్లుగా ప్రచారం సాగింది. అయితే, అనూహ్యంగా భూపేంద్ర పటేల్ కొత్త సీఎంగా ఎన్నికయ్యారు. శాసన సభా పక్ష సమావేశంలో తాజా -మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీనే భూపేంద్ర పటేల్ పేరును ప్రతిపాదించారు.
డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్..
ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు పార్టీ పరిశీలకులు..కేంద్ర మంత్రి తోమర్ వెల్లడించారు. సోమవారం గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ నియమితులు కానున్నారు. మరి కాసేపట్లో నూతన సీఎంగా ఎన్నికైన భూపేంద్ర పటేల్ గవర్నర్ ను కలవనున్నారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి హోం మంత్రి అమిత్ షా హజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 59 సంవత్సరాల భూపేంద్ర పటేల్.. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది.












Click it and Unblock the Notifications