మోడీ తాజా టార్గెట్: విపక్ష రహిత భారత్
భువనేశ్వర్: ఇప్పటివరకు కాంగ్రెస్ రహిత భారత్ నినాదంతో ముందుకు సాగిన ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు విపక్ష రహిత భారత్‌కోసం కదులుతున్నట్టు కనిపిస్తున్నది. తూర్పు, దక్షిణ భారతంలో విస్తరించడంపై దృష్టిపెట్టిన పాలక బీజేపీ మొదటి లక్ష్యంగా ఒడిశాను ఎంచుకున్నది. మోదీ ప్రతిష్ఠతో ఒడిశాలో పునాది విస్తరించుకోవాలని, వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బలపడాలని కమలనాథులు భావిస్తున్నారు. దానికి నాంది ప్రస్తావనగా ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో బీజేపీ ఘనంగా కార్యనిర్వాహక సమావేశాలు నిర్వహిస్తోంది.
ఇటీవల ఒడిశాలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ రెండోస్థానంలో నిలువడం గమనార్హం. మరో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోవడం బీజేపీకి కొంత ఉత్సాహాన్నిస్తున్నది. వరుసగా నాలుగోసారి అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ పార్టీ (బీజేడీ) పట్ల ప్రజల్లో సహజంగా గల వ్యతిరేకతను సొమ్ము చేసుకుని లబ్ధి పొందాలని కమలనాథులు చూస్తున్నారు.

ప్రాంతీయ పార్టీల కంచుకోట బద్దలుకు బీజేపీ వ్యూహం
తూర్పు, దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తరణపై గురిపెట్టిన కమలనాథులు ఒడిశాలో ఉనికి చాటుకునేందుకు ఘనంగా జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించడం, ప్రధాని నరేంద్రమోదీ రోడ్‌షోతో హంగామా చేయడం వెనుక 2019 ఎన్నికలే లక్ష్యంగా ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తున్న. విపక్ష విముక్త భారతాన్ని యూపీ తరహాలో ఒడిశాలో ప్రాంతీయ పార్టీల కంచుకోటలను బద్దలు కొట్టాలని, ఆ పరంపరలో ఇతర ప్రాంతాలకు విస్తరించాలని బీజేపీ చూస్తున్నది.

2019లో మహా కూటమి ఏర్పాటుపై నీలి నీడలు
2019 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా ‘మహా కూటమి' ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అందుకు మినహాయింపు కావచ్చునని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. తమిళనాట డ్రవిడ పార్టీలుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పరస్పరం పోటీ పడ్డా.. మోడీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు ఏం చేస్తాయన్నది మున్ముందు చూడాల్సిందే. ఇక పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతాబెనర్జీతో సీపీఎం, కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేయగలుగుతాయా? అన్న అనుమానాలు ఉన్నాయి.

యూపీలో విపక్ష వ్యూహం ఇలా ఉండొచ్చు?
ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ) కలిసి పనిచేసేందుకు సిద్దమన్న సంకేతాలు ఇచ్చారు. దీనికి తోడు సమకాలీన రాజకీయాల్లో ప్రధాని మోడీని ధీటుగా ఎదుర్కొనే వాక్చాతుర్యం గల నాయకుడు కూడా విపక్షాలకు అవసరం. ఆ దిశగా చూస్తే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఒక్కరే ప్రస్తుతం అందుకు సరైన నేతగా కనిపిస్తున్నారు. అంతా ఊహించినట్లు ఒక నేత సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నీ ముందుకు సాగితే కమలనాథులు, ప్రధాని మోడీ హావాకు అడ్డుకట్ట పడుతుందన్న భావనతోనే ఇతర రాష్ట్రాల్లోనూ పట్టు పెంచుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఒకవేళ అందరూ ఒక్కటై సమైక్యంగా పోటీ ఇద్దామనుకున్నా వారందరిపై అవినీతి, అసమర్థత ఆరోపణలతో పరువుపోయిన నేతలను ప్రజలు ఎంచుకుంటారా? అన్న సందేహం కలుగుతుంది. అందరూ కలిస్తే మోదీ మరింత బలవంతునిగా ఓటర్లకు కనిపించే అవకాశం కూడా లేకపోలేదు. మోదీ కోరుకుంటున్నదీ బహుశ అదే కావచ్చు.

ఈస్ట్ ఇండియా గేట్ వే ఒడిశా
ఈ నేపథ్యంలోనే తొలి అడుగుగా ఒడిశాలో పట్టు సాధించాలని కమలనాథుల వ్యూహంగా కనిపిస్తున్నది. గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ.. ఈ దఫా రెండేళ్ల ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. తూర్పు భారత రాష్ట్రాలకు ఒడిశా.. ‘గేట్ వే' అని కమలనాథులు భావిస్తున్నారు. తూర్పు భారత రాష్ట్రాలు తమ కాళ్లపై తాము నిలబడకుంటే దేశ ప్రగతిలో భాగస్వామ్యం కాలేవని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొనడం గమనార్హం. నిజానికి గత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవా ఒడిశాలో ఏమాత్రం పనిచేయలేదు. 21 లోక్‌సభ సీట్లలో కేవలం ఒక్క సీటు మాత్రమే కమలానికి దక్కింది. అభివృద్ధి ఎజెండాతో ఒడిశాను ప్రయోగశాలగా చేసుకోవాలని, సుదీర్ఘకాలం ప్రాంతీయ పార్టీ బిజూ జనతాదళ్ పార్టీకి అడ్డాగా మారిన ఒడిశాను ఒడిసిపట్టి సత్తా చాటుకోవాలన్నదే బీజేపీ వ్యూహంగా ఉన్నది.

2019లో కమలనాథుల ప్లాన్ ఇది..
2014 పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ వ్యూహాత్మకంగా చారిత్రక విజయాలు సాధించింది. 80 లోక్ సభా స్థానాలకు 71 గెలుచుకున్న బీజేపీ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి 325 స్థానాల్లో విజయం సాధించింది. కానీ 2019 నాటికి యూపీలో ప్రభుత్వ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుందని.. తద్వారా అక్కడ జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు కోరమాండల్ కోస్తా ప్రాంతాలను పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా ఎంచుకున్నదని కమలనాథులు చెప్తున్నారు.

ఇలా కోరమాండల్ కోస్తాలో విస్తరణ
కోరమాండల్ కోస్తా తీరం వెంబడి బీజేపీ విస్తరణకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బ్లూ ప్రింట్ సిద్ధం చేశారని పార్టీ వర్గాల కథనం. అందులో తొలి అడుగు ఒడిశా అని చెప్తున్నారు. గత మూడేళ్లలో అసోం, మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళలలో పునాది బలోపేతం చేసుకున్నామని కమలనాథులు అంటున్నారు. ఈ ఆలోచన క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరించడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నవీన్
2000 నుంచి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ పార్టీ మాత్రమే ఒడిశాలో అధికారంలో ఉన్నది. 2009 వరకు బీజేపీతో ఉన్న బంధాన్ని తెగతెంపులు చేసుకున్న నవీన్ పట్నాయక్ 2014 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లోనూ ఘన విజయాలు సాధించారు. కానీ బీజేడీలోని పలువురు ఎంపీలు జయ్ పాండా, తథాగథ సత్పథి, భర్త్రుహరి మెహ్తాబ్ వంటి వారంతా కమలం వైపు చూస్తున్నారని వినికిడి. వీరంతా తమ పాత స్నేహితులేనని ధర్మేంద్ర ప్రధాన్ అంటుంటారు. 1857లో తొలి స్వాతంత్ర్య పోరాటానికి ముందే 1817లో జరిగిన తిరుగుబాటులో మరణించిన అమరవీరుల కుటుంబాలను ప్ఱధాని మోడీ సందర్శించడంలో నేపథ్యం ఇదే. ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ‘పైకా తిరుగుబాటు'లో పాల్గొన్న వారి మద్దతు కూడగట్టడమే మోడీ లక్ష్యం.

కీలక ఓటుబ్యాంకు బలోపేతానికి బీజేపీ యత్నం
ఒరియన్ల మనోభావాలను పరిరక్షించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పూరీలోని జగన్నాథ ఆలయంలో పూజా విధానాల పునరుద్ధరణకు అనుమతినిచ్చింది. గొప్ప సంప్రదాయం గల తమ దేవుడు పూరీ జగన్నాథుడు సహనానికి ప్రతీక అని బీజేడీ ఎంపీ తదాగథ సత్పతి వ్యాఖ్యానించారు. బీజేడీతో బీజేపీ పోటీ పడటం ఆసక్తికరంగా మారిందన్నారు. సామాన్య ఒరియన్.. కమలనాథులకు మద్దతునిస్తారా? అన్నది వేచి చూడాల్సిందేనన్నారు. ఇప్పటికీ ఒడిశాలో ప్రజాదరణ గల నేత నవీన్ పట్నాయక్ మాత్రమే. కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న గిరిజనులను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తున్నది.

బెంగాల్‌లో ‘కమలం' విస్తరణ ప్లాన్ ఇదీ
అందుకోసం ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్ ప్రాంతాల్లోని లోక్ సభ నియోజకవర్గాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్రుష్టి సారించింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్ సభా నియోజకవర్గాల పరిధిలో కేంద్రీకరించి పని చేస్తున్నది. శారద, నారద స్కామ్‌లు జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదగాలన్న పశ్చిమ బెంగాల్ సీఎం కలలకు అడ్డంకిగా ఉన్నాయి. కనుక బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికలు మోడీ వర్సెస్ మమత అన్నట్లు సాగుతాయన్న అంచనాలు ఉన్నాయి.