సొంత ఎమ్మెల్యేలకు సీఎం ఫైన్, అవినీతి ఎస్సై ఇంట్లో...
జైపూర్/భోపాల్: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు కోపమొచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ శాసన సభా పక్ష సమావేసానికి ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. వారికి రూ.500 జరిమానా విధించారు. దీంతో పదిహేను మంది బీజేపీ ఎమ్మెల్యేలు జరిమానా చెల్లించవలసి వచ్చింది.
సమావేశాలకు మరోసారి ఆలస్యంగా వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఆమె సభ్యులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి జరిమానాతో మొదట విస్తుపోయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, సమయపాలన విలువ తెలిపేందుకే తమ నేత ఇలా చేశారని వ్యాఖ్యానించారు.

అవినీతి ఎస్‌ఐ ఇంట్లో అంగన్‌వాడీ భవనం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అవినీతిపరులపై కొరడా ఝుళిపించారు. నిబంధనలు ఉల్లంఘించి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనూ ప్రజోపయోగానికి ఆయన పెద్ద పీట వేశారు.
ఒక కేసులో అరవింద్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ అవినీతిపరుడుగా తేలడంతో అతని ఇంటి ఆవరణంలో ఒక అంగన్‌వాడీ భవనం, ఒక స్కూల్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఇలా అవినీతి పరుల ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజావసరాల కోసం వాటిని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications