కిలో తగ్గితే రూ.వెయ్యి కోట్లు.. ఎంపీకి గడ్కరీ బంపర్ ఆఫర్.. 5 నెలల్లో 15 కిలోలు తగ్గి
ఉజ్జయిని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా.. హెవీ వెయిట్.. దాదాపు 127 కిలోలు ఉండేవారు. ఈ ఏటా ఫిబ్రవరిలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆ సమయంలో గడ్కరీ వెయిట్ లాస్ గురించి మాట్లాడారు. బరువు తగ్గితే నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. దీంతో అతను బరుతు తగ్గేందుకు విశ్వ ప్రయత్నమే చేశారు. అలా చివరికీ 15 కిలోల వరకు తగ్గారు.

కిలో రూ. వెయ్యి కోట్లు
ఫిరోజియా తగ్గిన ప్రతి కిలోకు ఉజ్జయిని అభివృద్ధికి ₹1,000 కోట్లు మంజూరు చేస్తానని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఆ మేరకు గడ్కరీ ఉజ్జయినీకి 15 వేల కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉంది. దీనిపై ఫిరోజియా స్పందించారు. ప్రపంచంలో ఖరీదైన ఎంపీని తనేనని చెప్పారు. గడ్కరీ ఓ కార్యక్రమంలో చెప్పిన సమయంలో 127 కిలోల బరువు ఉండేవానని తెలిపారు. ఇప్పుడు 112 కిలోలు ఉన్నానని వివరించారు.

సవాల్
గత ఫిబ్రవరిలో కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్‌లోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.5,772 కోట్ల విలువైన 11 రహదారుల ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. మకోడియామ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి గడ్కరీ సొంత పార్టీకి చెందిన ఎంపీ అనిల్ ఫిరోజియాకు సవాల్ విసిరారు.

పనుల కోసం నిధులు..
అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని అదేపనిగా డిమాండ్ చేస్తుంటాడు. అతడికి నేను ఒక షరతు విధిస్తున్నాను. గతంలో నేను 135 కిలోల బరువు ఉండేవాడినని చెప్పారు. ఇప్పుడు 93 కిలోలకు తగ్గానని వివరంచారు. తన పాత ఫొటో అతడికి చూపించానని.. అందులో తనను ప్రజలు ఏమాత్రం గుర్తుపట్టలేరు. ఎన్ని కేజీలు బరువు తగ్గితే, కేజీకి రూ.1000 కోట్ల చొప్పున ఉజ్జయిన్ నియోజకవర్గానికి కేటాయిస్తాను. అందుకు చేయాల్సిందల్లా బరువు తగ్గడమే. అదెలాగో చెబుతా అంటూ ఆనాడు గడ్కరీ కామెంట్ చేశారు.

కష్టపడి మరీ
గడ్కరీ చాలెంజ్ ను అనిల్ ఫిరోజియా తీవ్రంగా పరిగణించారు. అప్పటి నుంచి వెయిట్ లాస్ కోసం ప్రత్యేక ఎక్సర్ సైజులు చేస్తున్నారు. తన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుని స్పెషల్ డైట్ ప్లాన్ అనుసరిస్తున్నారు. రోజూ రెండు గంటల పాటు వ్యాయామం, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తున్నారు. తాను తగ్గే ప్రతి కేజీ బరువుకు గడ్కరీ కేంద్రం నుంచి రూ.1000 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారని వెల్లడించారు. ఇప్పుడు రూ.15 వేల కోట్ల మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఫిరోజియాకు ఆరోగ్యంతోపాటు.. నియోజకవర్గానికి నిధులు కూడా సమకూరినట్టే అయ్యింది.












Click it and Unblock the Notifications