రాజ్యసభలో బోరున ఏడ్చిన బీజేపీ ఎంపీ ; బెంగాల్‌లో రక్షణ లేదు.. రాష్ట్రపతి పాలన విధించండి..
పశ్చిమబెంగాల్ బీర్భూం జిల్లాలో చోటుచేసుకున్న సజీవదహనాల సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంటును కుదిపేసింది. మమతా బెనర్జీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్భూం జిల్లాలోని బోగ్‌టూయి గ్రామంలో హింసాత్మక ఘటనకు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ ను ఆదుకోవాలంటూ రాజ్యసభలో ఏడ్చేశారు.. జీరో అవర్ లో బీర్భూం జిల్లాలో హింసను ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు.

కన్నీరు పెట్టుకున్న రూపా గంగూలీ
మమతా బెనర్జీ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఎంపీ రూపా గంగూలీ ఆరోపించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. దీదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అటాప్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం .. మొదట అక్కడ వాళ్లను కొట్టినట్లు తెలుస్తోందన్నారు. అనంతరం వారందరిని సామూహిక హత్యలు జరిగినట్లు రూపా గంగూలీ ఆరోపించారు. ఈ క్రమంలో మరణాలను తలచుకొని రూపా కన్నీరు పెట్టుకున్నారు.
రాష్ట్రపతి పాలనకు డిమాండ్
బెంగాల్‌లో సామాన్యులు జీవించలేకపోతున్నారని ఎంపీ రూపా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుందని మండిపడ్డారు. సామూహిక హత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ నుంచి ప్రజలు పారిపోతున్నారని పేర్కొన్నారు. భారత్‌లో బెంగాల్ భాగమని.. అక్కడ జీవించే హక్కు ఉంది.. తాము బెంగాల్‌లోనే పుట్టామని. అక్కడ పుట్టడం తమ తప్పుకాదన్నారు. అది మహాకాళి భూమి అని దీదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బోగ్‌టూయిలో కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని, ఎక్కువ మంది చనిపోలేదంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు.

కేసు విచారణకు సీబీఐకి అప్పగింత
ఎంపీ రూపా గంగూలీ మాట్లాడుతున్న సమయంలో రాజ్యసభలో గంగరగోళం నెలకొంది. టీఎంసీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. మరోవైపు ఈ సజీవదహనాల కేసు విషయంలో కోల్ కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. టీఎంసీకి చెందిన బర్షాల్ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్యకు గురయ్యాడు. దీంతో బోగ్‌టూయిలో హింసలు చెలరేగాయి. ప్రత్యర్థుల ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. ఇళ్లలో పెట్టి నిప్పంటించడంతో 8 మంది సజీవదహనం అయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టీఎంసీ బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సెన్ తో పాటు మరో 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు దీదీ ప్రభుత్వంపై కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications