నాలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులు- అనూహ్యంగా
భారతీయ జనతా పార్టీ సంస్థాగత స్థాయిలో కీలక మార్పులు చేపట్టింది. నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వం కొద్దిసేపటి కిందటే వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేసింది. ఇటీవలే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ మార్పులు చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటిలో రెండు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి కూడా.
తాజాగా పంజాబ్, త్రిపుర, హర్యానా, ఢిల్లీలకు బీజేపీ నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్ ధిల్లాన్ అపాయింట్ అయ్యారు. ఈశాన్యాన ఉన్న త్రిపురలో పార్టీ పగ్గాలు అభిషేక్ దేబ్‌రాయ్ చేతికి చిక్కాయి. ఆయన పార్టీ రాష్ట్రశాఖ చీఫ్ గా నియమితులయ్యారు. హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా డాక్టర్ అర్చనా గుప్తా నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ రాజధానిలో పార్టీ రాష్ట్రశాఖ బాధ్యతలను హర్ష్ మల్హోత్రాకు అప్పగించారు.

- పంజాబ్ కొత్త అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ బర్నాలా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022 సంగ్రూర్ లోక్‌సభ, 2024లో బర్నాలా అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున పోటీ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు. బర్నాలా ప్రజలు ఆయన్ను 'వికాస్ పురుష్'గా గౌరవిస్తారు. తన రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి అంశాలకే ప్రాధాన్యతనిచ్చిన ధిల్లాన్ కు వివాదరహితుడిగా పేరుంది.
- ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా పార్టీలో సీనియర్ నాయకుడు. ఢిల్లీ నుండి లోక్‌సభ ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, సుదీర్ఘకాలం సంస్థాగత రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, ప్రజా సంబంధాలు, వ్యవస్థాపర సామర్థ్యాన్ని పెంపొందించడంలో గుర్తింపు పొందారు.
- హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన డాక్టర్ అర్చనా గుప్తా క్రియాశీలక నాయకురాలు. సంస్థాగత రాజకీయాలపై గట్టి పట్టున్న ఆమె, పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ హోదా కోసం అనూహ్యంగా మహిళను ఎంపిక చేసింది పార్టీ అగ్ర నాయకత్వం.
- త్రిపుర బీజేపీ అధ్యక్షుడు అభిషేక్ దెబోరాయ్ క్రియాశీలక నాయకుడు. పార్టీలో సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో పని చేసిన అనుభవిం ఆయనకు ఉంది. పార్టీ ప్రచార కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో త్రిపురలో పార్టీ సంస్థాగతంగా బలోపేతమౌతుందని, ప్రజాదరణ పెరుగుతుందని అధిష్టానం ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications