మోడీ చాణక్యం..! ఓ మంత్రి రాజీనామాతో ఖాళీ అయిన బెర్తు మరో కేంద్రమంత్రికి..!
గత రెండు, మూడు నెలలుగా జాతీయ స్ధాయిలో, ముఖ్యంగా ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయినా కేంద్రమంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో రాజ్యసభ ఎంపీలుగా ఉన్న వారు తమ పదవీకాలాలు ముగిసిపోయి రాజీనామా చేస్తున్నా, వారికి మరో ఛాన్స్ ఇవ్వడం లేదు. దీంతో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన తప్పనిసరిగా చేపట్టాల్సిన పరిస్ధితుల్లో ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన సొంత పార్టీ బీజేపీ (BJP) కీలక ప్రకటన చేసింది.
ఇప్పటికే రాజ్యసభ పదవీకాలం ముగిసిన ఇద్దరు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్ నీత్ సింగ్ బిట్టూ కేంద్రమంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత అనూహ్య పరిస్ధితుల్లో తమిళనాడుకు చెందిన మరో కేంద్రమంత్రి ఎల్ మురుగన్ కూడా నాలుగేళ్లు రాజ్యసభ పదవీకాలం ఉన్నప్పటికీ కేంద్రమంత్రి పదవికీ, రాజ్యసభ సీటుకూ గుడ్ బై చెప్పేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానంటూ స్వరాష్ట్రానికి వెళ్లిపోయారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ లోని రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీన్ని అనూహ్యంగా రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్న మరో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి బీజేపీ కేటాయించింది.

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉపఎన్నిక కోసం కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని బీజేపీ ఇవాళ తమ అభ్యర్థిగా ప్రకటించింది. అక్టోబర్ 14న రాజ్యసభ సభ్యత్వానికి ఎల్.మురుగన్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఆయనను ఎంపిక చేశారు. ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు పోటీ చేసే ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాలో హర్దీప్ సింగ్ పూరీకి చోటు దక్కలేదు. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కుల, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో, ఉత్తరప్రదేశ్ నుండి పదవీకాలం ముగియనున్న ఏ ఎంపీకి కూడా పార్టీ మళ్లీ అవకాశం కల్పించలేదు. దీంతో హర్దీప్ సింగ్ పూరీని కూడా కేంద్ర కేబినెట్ నుంచి తప్పించబోతున్నారనే చర్చ జరిగింది. కానీ ఎల్ మురుగన్ ఖాళీ చేసిన మధ్యప్రదేశ్ సీటుకు జరిగే ఉపఎన్నికలో హర్దీప్ పూరీని నిలబెట్టడాన్ని బట్టి చూస్తే మురుగన్ రాజీనామా వెనుక కీలక కారణాలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.














Click it and Unblock the Notifications
