బీజేపీ ఎంపీ ఇంట్లో పెను విషాదం: బాణాసంచా కాల్చుతూ గాయపడ్డ మనవరాలు మృతి
లక్నో: భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యురాలు రీటా బహుగుణ జోషి నివాసంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చుతూ గాయపడ్డ ఆమె మనవరాలు మరణించారు. దేశ రాజధానిలో అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతోన్న ఆమె కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని తన నివాసం టెర్రస్ మీద బాణాసంచా కాల్చుతున్న సమయంలో ఎనిమిదేళ్ల ఆ బాలిక తీవ్రంగా గాయపడ్డారు.
ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ స్థానానికి రీటా బహుగుణ బీజేపీ తరఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. దీపావళి పండుగ నాడు టెర్రస్ మీద పటాకులను కాల్పే సమయంలో ఆమె మనవరాలు గాయపడ్డారు. టెర్రస్ మీద పిల్లలతో తోటి పిల్లలతో కలిసి బాణాసంచాను కాల్చుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలాసేపటి వరకు ఎవరూ ఆ బాలిక గాయపడినట్లు గుర్తించలేకపోయారు. టపాకుల మోతలో ఆమె ఏడుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ సమయంలో తోటి పిల్లలు కూడా ఎవరూ సంఘటనా స్థలంలో లేరు.

బాణాసంచా కాల్చే సమయంలో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరగడం, ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో జాప్యం చోటు చేసుకుంది. టెర్రస్ మీదే గాయాలతో మూర్ఛపోయిన స్థితిలో ఆ బాలిక కనిపించారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను తొలుత ప్రయాగ్‌రాజ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలైనట్లు డాక్టర్లు ధృవీకరించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. మృతదేహాన్ని ఎయిమ్స్ నుంచి ప్రయాగ్‌రాజ్ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications