MH Elections: మహారాష్ట్రలో 25 మందితో బీజేపీ మూడో జాబితా-వీరే కీలకం..!
మహారాష్ట్రలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్ధుల మూడో జాబితా ఇవాళ విడుదలైంది. మహాయుతి కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న బీజేపీ ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసింది. ఇవాళ 25 మందితో మూడో జాబితాను ప్రకటించింది. ఇందులో పలువురు సీనియర్లతో పాటు కొత్త ముఖాలు కూడా ఉన్నాయి. అలాగే డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కు ఎన్నో ఏళ్లుగా పీఎస్ గా పనిచేస్తున్న సుమిత్ వాంఖడేకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.
ఈ జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకూ మొత్తం 146 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇవాళ ప్రకటించిన 25 మంది జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ముంబై పశ్చిమ భాగంలోని వెర్సోవా స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే భారతీ లవేకర్, లాతూర్ సిటీ నుండి అర్చన శైలేష్ పాటిల్ చకుర్కర్ ఉన్నారు. మిగిలిన ఇద్దరు పాల్ఘర్ జిల్లాలోని వాసాయి స్థానం నుండి పోటీ చేసిన స్నేహ దుబే, వాషిమ్‌లోని కరంజా నుండి సాయి ప్రకాష్ దహకే ఉన్నారు.

మరోవైపు రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోనూ తమ పట్టు కొనసాగించాలని భావిస్తున్న బీజేపీ ...ఈ జాబితాలో పలువురు ప్రముఖులకు సీట్లు కేటాయించింది. ఇందులో నాగ్‌పూర్, చంద్రపూర్, లాతూర్‌తో సహా కీలకమైన సీట్లు ఉన్నాయి. ఇవన్నీ పార్టీ ఎన్నికల టార్గెట్ కు ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్న ప్రాంతాలే. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications