బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ కన్నుమూత: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
పాట్నా: బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ (72) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత ఏడు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. సుశీల్ కుమార్ మోడీ మరణించిన విషయాన్ని బీహార్ బీజేపీ సోషల్ మీడియాలో వెల్లడించింది.
సుశీల్ కుమార్ మోడీ మరణవార్తతో బీజేపీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని పేర్కొంది. ఆయన మరణం బీజేపీ కుటుంబానికి తీరని లోటుగా ఆవేదన వ్యక్తం చేసింది. సుశీల్ కుమార్ మోడీ మరణంతో ఆ పార్టీ నేతలు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు. సుశీల్ కుమార్ మోడీ తన అనారోగ్య కారణాలతోనే ఈసారి ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు.

బీహార్ రాజకీయాల్లో సుశీల్ కుమార్ మోడీ సీనియర్ నేత. 2005 నుంచి 2020 మధ్య సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంలో రెండు సార్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉపఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్ కుమార్ మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఆయన పదవీ కాలం ముగిసింది.
पार्टी में अपने मूल्यवान सहयोगी और दशकों से मेरे मित्र रहे सुशील मोदी जी के असामयिक निधन से अत्यंत दुख हुआ है। बिहार में भाजपा के उत्थान और उसकी सफलताओं के पीछे उनका अमूल्य योगदान रहा है। आपातकाल का पुरजोर विरोध करते हुए, उन्होंने छात्र राजनीति से अपनी एक अलग पहचान बनाई थी। वे… pic.twitter.com/160Bfbt72n
— Narendra Modi (@narendramodi) May 13, 2024
నా సహచరుడిని కోల్పోయా: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
సుశీల్ కుమార్ మోడీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి వున్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పార్టీలో తన విలువైన సహచరుడు, దశాబ్దాలుగా తన మిత్రుడు సుశీల్ మోడీజీ అకాల మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బీహార్‌లో బీజేపీ ఎదుగుదలకు, దాని విజయాలకు ఆయన ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు.
ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఎంతో కష్టపడి, స్నేహశీలిగా ఉండే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఆయనకున్న అవగాహన చాలా లోతైనది. పరిపాలనాదక్షుడిగా కూడా ఎన్నో ప్రశంసనీయమైన పనులు చేశారు. జీఎస్టీని ఆమోదించడంలో ఆయన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ శోక ఘడియలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి! అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications