మహారాష్ట్రపై బీజేపీ పద్మవ్యూహం?
మహారాష్ట్ర అసెంబ్లీ ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి జమ్ముకాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు మహారాష్ట్ర, జార్కండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే జమ్ము కాశ్మీర్ లో శాంతి భద్రతల సమస్య ఎక్కువగా ఉండటంతో ఈ రాష్ట్రంలో దశలవారీగా పోలింగ్ షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబరు నాలుగోతేదీన వెలువడతాయి. ప్రధానంగా జమ్ము కాశ్మీర్ పై దృష్టిపెట్టిన బీజేపీ అగ్ర నాయకత్వం ఇదే సమయంలో మహారాష్ట్రపై దృష్టి కేంద్రీకరించడం కష్టమనే భావనతోనే ఈ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజలకు తప్పుడు సంకేతాలు
మహారాష్ట్రలో 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 23 స్థానాలను కైవసం చేసుకుంది. 2024లో జరిగిన ఎన్నికలకు వచ్చేసరికి తొమ్మిది స్థానాలకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం శివసేనను చీల్చి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అంతేకాదు.. రాజకీయ ధురంధరుడు శరద్ పవర్ పార్టీ ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ నాయకత్వంలోని పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో బీజేపీ అగ్రనాయకత్వం దీనిపై వ్యూహరచనలో నిమగ్నమై ఉంది.

కూటమిది తిరుగులేని ఆధిపత్యం
మహారాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను కేంద్ర రాజకీయాలకు తీసుకువచ్చి ఇక్కడి పగ్గాలను వేరే నాయకులకు అప్పగించాలనే యోచనలో ఉంది. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ స్థానాన్ని భర్తీచేసే నాయకుడు బీజేపీ నేతలకు దొరకడంలేదు. ఆర్ఎస్ఎస్, నరేంద్రమోడీ మాత్రం ఫడ్నవిస్ కే మద్దతు పలుకుతున్నారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, శరద్ పవార్, ఉద్దవ్ థాకరే పార్టీలు కలిసి మహావికాస్ అఘాడీని ఏర్పాటు చేశాయి. మొత్తం 48 స్థానాలకు 30 స్థానాలను కైవసం చేసుకొని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఇదే ఊపులో రాష్ట్రంలో పాగావేస్తామనే ధీమాతో ఈ కూటమి ఉంది. దీనిపై బీజేపీ అగ్ర నాయకత్వం ఒక ప్రణాళికను రూపొందించుకున్న తర్వాతే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications