మీ ఇష్టం.. ఇంతకంటే చేయలేం: బిజెపికి కమల్ నాథ్

తెలంగాణ ముసాయిదా బిల్లును రాజ్యసభలో పెట్టే విషయమై నిన్నటి నుండి బిజెపి, కాంగ్రెసు పార్టీల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. బిజెపి పలు సవరణలకు పట్టుబడుతోంది. వాటికి కేంద్రం అంగీకరించినట్లు, బిజెపి మెత్తబడినట్లుగా వార్తలు వచ్చాయి.
మధ్యాహ్నం మూడు గంటలకు బిల్లును రాజ్యసభలో పెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో బిజెపి సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులతో కేంద్రమంత్రులు కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ తదితరులు చర్చలు జరుపుతున్నారు. బిల్లు లోపభూయిష్టంగా ఉందని, సవరణలు చేయాలని బిజెపి సూచిస్తోంది.
సవరణలు చేసేది లేదని బిజెపికి కేంద్రమంత్రులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంతకన్నా తామేం చేయలేమని, మీకు నచ్చితే ఓటు వేయవచ్చు లేదంటే వ్యతిరేకించవచ్చునని బిజెపికి చెప్పినట్లుగా తెలుస్తోంది. బిల్లులో సవరణలు చేస్తే లోకసభకు పంపించవలసి ఉంటుందని అయితే, ప్రధానితో మాత్రం తాము ప్రకటన చేయిస్తామని, దాంతో సరిపెట్టుకోవాలని కేంద్రమంత్రులు బిజెపికి సూచించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications