J & K Elections: బీజేపీ లిస్టులో బిగ్ ట్విస్ట్ - విత్ డ్రా..!!
బీజేపీ నాయకత్వం జమ్ము కాశ్మీర్ ఎన్నికల పై తర్జన భర్జన పడుతోంది. ఈ సారి అక్కడ గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. 370 రద్దు తరువాత ఆ రాష్ట్రంలో బలం పెరిగిందని బీజేపీ అంచనా వేస్తోంది. పదేళ్ల కాలం తరువాత జరుగుతున్న ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తోంది. అందులో భాగంగా ఈ ఎన్నికల కోసం 44 మందితో జాబితా ప్రకటించిన బీజేపీ కొద్ది క్షణాల్లో ఆ జాబితాను ఉప సంహరించుకుంది. మార్పులతో కొత్త జాబితా ప్రకటిస్తామని వెల్లడించింది.
జమ్ము కాశ్మీర్ లో ఎన్నికల్లో బీజేపీ ఆచి తూచి అడుగు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పొత్తులు ఖరారు చేసుకుంది. ఎలాగైనా బీజేపీని అడ్డుకోవాలని భావిస్తున్న హస్తం పార్టీ నేషనల్ కాన్ఫిరెన్స్ తో పొత్తుపైన ఒక నిర్ణయానికి వచ్చాయి. తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే కూటమికి సహరించే అంశం పరిశీలిస్తామని పీడీపీ ప్రకటించింది. ఈ సమయంలోనే బీజేపీ అలర్ట్ అయింది. బీజేపీ తమ పార్టీ నుంచి రామ్ మాధవ్, కిషన్ రెడ్డిలను ఎన్నికల ఇన్‌చార్జిలుగా ప్రకటించింది.

వరుస సమావేశాల తరువాత బీజేపీ 44 అభ్యర్థులతో కూడిన తాజాగా తొలి జాబితాను విడుదల చేసింది. మూడు విడతలుగా జరిగిన సమావేశాల్లో ఖరారు చేసిన అభ్యర్దులతో బీజేపీ జాబితా విడుదల చేసింది. కానీ, లిస్టు ప్రకటన తరువాత పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో క్షణాల వ్యవధిలోనే ఆ జాబితాను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పార్టీ ప్రకటించింది. మార్పులతో త్వరలోనే జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ జాబితాలో మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌కు టికెట్ దక్కలేదు. కొన్ని స్థానాల్లో అభ్యర్దుల మార్పు ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. ఆగస్టు 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అటు ఆప్ సైతం తమ పార్టీ పోటీ చేసే స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేస్తోంది. దీంతో, కాంగ్రెస్ తో పొత్తుల అంశం క్లారిటీ వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎన్నికల్లో ఎవరు ఎవరితో తల బడతారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications