షాకింగ్ : కోవిడ్ 19 చికిత్సలోనూ వివక్ష... నల్లజాతీయుల పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం.. వెలుగుచూసిన దారుణం
డాక్టర్ అంటే ప్రాణాలు పోసే దేవుడని చాలామంది భావిస్తారు. కానీ ఆ డాక్టరే పేషెంట్ పట్ల వివక్ష చూపిస్తే...? కేవలం నల్లజాతి వ్యక్తి అన్న కారణంగా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే...?
అమెరికాలో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి ఇప్పటివరకూ ఎన్నో ఉదంతాలు బయటపడ్డాయి. ఇటీవల డా.సూసన్ మూరే(52) అనే ఓ నల్లజాతీయురాలు ఆస్పత్రిలో తనకు ఎదురైన వివక్ష గురించి బయటపెట్టారు.
తానూ ఓ ఫిజీషియన్ అయినప్పటికీ.. తనకు చికిత్స చేసిన వైద్యుడు తనను ఓ నల్లజాతి మనిషిగానే చూశాడని,చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికన్ హెల్త్ కేర్ వ్యవస్థలోనూ నల్లజాతీయుల పట్ల వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఈ విషయాలను బయటపెట్టిన కొద్దిరోజులకే కరోనా సంబంధిత సమస్యలతో ఆమె మరణించారు.

పట్టించుకోని డాక్టర్.. మూరే కన్నీళ్లు...
నల్లజాతీయురాలైన సూసన్ మూరే అమెరికాలో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డ ఆమె చికిత్స కోసం ఇండియానా ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ తనకు చికిత్స అందించిన డాక్టర్ తన పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆమె ఆరోపించారు. ఆస్పత్రి బెడ్ పైన ఉన్న సమయంలోనే తన ఆవేదనను సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పినా... మెడ భాగంలో నొప్పి ఉందని చెప్పినా ఆ డాక్టర్ తనను పట్టించుకోలేదని మూరే ఆ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో తీవ్రమైన నొప్పి,శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడినట్లు తెలిపారు.

నేనే గనుక శ్వేత జాతీయురాలినై ఉంటే...: మూరే
'నేను మెడ నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆ డాక్టర్ నాకు పెయిన్ రిలీఫ్ మెడిసిన్ ఇచ్చేందుకు నిరాకరించాడు. పైగా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవాలన్నాడు. తాను నార్కోటిక్స్(పెయిన్ రిలీఫ్) ఇవ్వనని పదేపదే చెప్పాడు. ఒకరకంగా నన్నో డ్రగ్ ఎడిక్ట్‌లా భావించేలా చేశాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పినా...కనీసం నన్ను తాకడం కానీ,ఊపిరితిత్తులను పరిశీలించడం గానీ చేయలేదు. దీంతో అంత అవస్థలో నేను ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఒకవేళ నేనే గనుక శ్వేత జాతీయురాలినైతే ఇలాంటి దుస్థితి ఎదురై ఉండేది కాదు.' అని మూరే ఆవేదన వ్యక్తం చేశారు.

చికిత్సలోనూ వివక్ష...
ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన కొద్దిరోజులకే డా.మూరే కరోనా సంబంధిత సమస్యలతో మరణించారు. ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేయడంతో వ్యాధి లక్షణాలు తీవ్రమై తుది శ్వాస విడిచారు.మూరే వీడియోను సోషల్ మీడియాలో దాదాపు 4 మిలియన్ల మంది వీక్షించారు. మూరే మరణంతో అమెరికాలో కోవిడ్ 19 చికిత్సలోనూ నల్లజాతీయుల పట్ల వివక్ష కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవలి కాలంలో వెలుగుచూసిన పలు అధ్యయనాల్లో అమెరికాలో కరోనా కారణంగా మరణిస్తున్నవారిలో నల్లజాతీయులే ఎక్కువగా ఉన్నట్లు తేలడం గమనార్హం. స్వయంగా ఫిజీషియన్ అయిన మూరే లాంటి వారి పట్లనే డాక్టర్లు ఇలా వ్యవహరిస్తున్నారంటే ఇక సాధారణ నల్లజాతీయుల పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

విచారణ జరిపిస్తామన్న ఆస్పత్రి యాజమాన్యం...
మరోవైపు ఇండియానా యూనివర్సిటీ హెల్త్ ఆర్గనైజేషన్ మూరే పట్ల శ్వేత జాతి డాక్టర్ వ్యవహరించిన తీరుపై స్పందించడానికి నిరాకరించింది. అయితే జాతి విద్వేషానికి వ్యతిరేకంగా తమ విధానాలు ఉంటాయని... పారదర్శకమైన వైద్య సేవలు అందిస్తామని తెలిపింది. మూరే చేసిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చింది. చదువు,సంపద,హోదా అన్నీ ఉన్నప్పటికీ కేవలం నల్లజాతి అన్న కారణంగా పేషెంట్ల పట్ల కూడా డాక్టర్లు వివక్ష చూపించడాన్ని అక్కడి నల్లజాతీయులు నిరసిస్తున్నారు.