సిద్ధగంగ మఠంలో నరేంద్ర మోడీ: నొసట విభూతి, మెడలో రుద్రాక్షమాల: న్యూ లుక్.. !
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణ కర్ణాటక పర్యటన గురువారం ఆరంభమైంది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నరేంద్ర మోడీ బెంగళూరుకు చేరుకున్నారు. వైమానిక దళానికి చెందిన విమానాశ్రయంలో ఆయనను కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్రమంత్రి సదానంద గౌడ తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నరేంద్ర మోడీ నేరుగా తుమకూరులోని సిద్ధగంగ మఠానికి చేరుకున్నారు.

నుదుట విభూతి.. మెడలో రుద్రాక్షమాల
అక్కడి శివకుమార స్వామి సమాధిని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం ప్రతినిధులు ఆయనకు రుద్రాక్షమాలను మెడలో వేశారు. నుదుట విభూతిని అద్ది.. ఆహ్వానం పలికారు. శివకుమార స్వామి ఫొటోలు, ఆయన వినియోగించిన వస్తువులు, దుస్తులు.. ఇతర సామాగ్రితో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని ప్రారంభించారు. అక్కడే సిద్ధగంగ మఠం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ తనదైన శైలిలో ప్రసంగించారు.

కాంగ్రెస్ పై నిప్పులు..
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ తన ప్రసంగంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు వంటి అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. హిందూమతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తోందని విమర్శించారు. పాకిస్తాన్ కు అనుకూల ప్రకటనలు చేస్తూ, దేశానికి ద్రోహం చేస్తోందని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలు, హింసాత్మక పరిస్థితుల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని మోడీ ధ్వజమెత్తారు.

అల్లర్ల వెనుక కాంగ్రెస్ ..
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లల్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్న భారత హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని, దీన్ని చిత్తశుద్ధి అమలు చేసి తీరుతామని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. భారతీయ శరణార్థులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి తాము ఈ చట్టాన్ని తీసుకొచ్చామని, తమను ప్రశంసించాల్సింది పోయి, తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అల్లర్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

పాకిస్తాన్ ను ఎందుకు విమర్శించరు?
హిందువులను అణచివేస్తోన్న పాకిస్తాన్ ను కాంగ్రెస్ నాయకులు ఎందుకు విమర్శించరని నిలదీశారు. తమదేశంలో నివసిస్తోన్న భారతీయులను పాకిస్తాన్ తీవ్రంగా అణచి వేస్తోందని, వారిపై అత్యాచారాలకు పాల్పడుతోందని అన్నారు. అలాంటి పాకిస్తాన్ ను కాంగ్రెస్ నాయకులు వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి తాము ప్రచార కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు.

ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం..
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని తాము రద్దు చేశామని మోడీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ ను అఖండ భారతావనిలో విలీనం చేయడం తాము సాధించిన ఘన విజయాల్లో ఒకటిగా అభివర్ణించారు. చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదాన్ని పరిష్కరించగలిగామని, సిద్ధగంగ పీఠాధిపతి శివకుమార స్వామి ఆశీస్సులతో తాము రామమందిర నిర్మాణాన్ని అనుుకన్న సమయానికి పూర్తి చేస్తామని మోడీ అన్నారు.












Click it and Unblock the Notifications