మీరట్ 'బ్లూ డ్రమ్' హత్యకేసు.. హంతకురాలి బిడ్డకు అసలు తండ్రి ఎవరు?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో సంచలనం సృష్టించిన సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు ముస్కాన్ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన అనంతర ముస్కాన్ ఆస్పత్రిలో గుక్కపెట్టి ఏడ్చింది. ఈ విషయాన్ని ఆమెకు డెలివరీ చేసిన మీరట్ మెడికల్ కాలేజీ డాక్టర్ వెల్లడించారు. ముస్కాన్‌కు డెలివరీ చేసిన డాక్టర్ శకున్ మాట్లాడుతూ.. శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ముస్కాన్ గుక్కపెట్టి ఏడ్చిందని తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆమె కళ్లు చెమ్మగిల్లాయని.. ఎందుకంటే ఆమెను, బిడ్డను పరామర్శించడానికి ఎవరూ రాలేదు.
మెడికల్ కాలేజీలో చేరిన ముస్కాన్ డాక్టర్లతో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. చాలా ప్రశ్నలకు తల ఊపడం ద్వారా లేదా ఒకటి, రెండు పదాలు మాట్లాడటం ద్వారా మాత్రమే సమాధానం ఇచ్చేదని డాక్టర్ శకున్ వెల్లడించారు. ముస్కాన్‌కు తన పాత రోజులు గుర్తుకు వచ్చి ఉంటాయని డాక్టర్ శకున్ అభిప్రాయపడ్డారు. ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను చూసేందుకు క్యూ కట్టేవారు. కానీ ఈసారి ఆమె ముఖం కానీ, బిడ్డను చూడటానికి కానీ ఎవరూ రాకపోవడం ఆమెను బాధించి ఉండవచ్చు.

నవంబర్ 24న మీరట్ మెడికల్ కాలేజీలో బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్ నవంబర్ 26న డిశ్చార్జ్ అయ్యింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ధ్రువీకరించిన డాక్టర్ శకున్, తల్లీబిడ్డలు మళ్లీ జైలు గదికి చేరుకున్నారని తెలిపారు. బిడ్డకు టీకాలు కూడా వేశారు.
డీఎన్‌ఏ పరీక్షపై వైద్యుడి క్లారిటీ
ముస్కాన్‌కు పుట్టిన బిడ్డకు అసలు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి సౌరభ్ కుటుంబ సభ్యులు (ముఖ్యంగా సౌరభ్ సోదరుడు రాహుల్) డీఎన్‌ఏ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. డీఎన్ఏ పరీక్ష డిమాండ్ పై స్పందిస్తూ డాక్టర్ శకున్.. కోర్టు ఆదేశాల ద్వారా మాత్రమే డీఎన్ఏ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. డీఎన్ఏ పరీక్ష కోసం బిడ్డ రక్తం శాంపిల్‌ను తీసుకుంటారని.. దీన్ని డీఎన్‌ఏ టెస్ట్ చేసే ప్రయోగశాలకు పంపిస్తారని తెలిపారు.
జైలులో తల్లి, బిడ్డ భవిష్యత్తు
జైలు నియమాల ప్రకారం.. తల్లితో పాటు బిడ్డ ఆరేళ్ల వయస్సు వచ్చేవరకు జైలులో ఉండవచ్చు. జైలు సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. బిడ్డకు ఆరు సంవత్సరాలు వచ్చే వరకు తల్లితో పాటు జైలులో ఉండేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ ఆరేళ్ల వరకు బిడ్డ ఆరోగ్యం, చదువు, తిండి, బొమ్మలు సహా అన్ని బాధ్యతలు జైలు పాలనదేనని స్పష్టం చేశారు. బిడ్డను ప్రతిరోజూ జైలు వాహనంలో బయటకు చదువుకోవడానికి పంపుతారని తెలిపారు. ఆరేళ్ల తర్వాత కూడా బంధువులు ఎవరూ బిడ్డను దత్తత తీసుకోకపోతే, తల్లి అనుమతి, కోర్టు ఆదేశాల మేరకు బిడ్డను బాల సంక్షేమ గృహానికి పంపుతారు. బిడ్డ డీఎన్‌ఏ పరీక్ష చేయాలా లేదా అనేది కోర్టు విచక్షణ అధికారంలో ఉంటుందని జైలు సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications