BMC Results 2026: కమలం జోరు.. ఠాక్రే సోదరులకు షాక్?
BMC Results 2026: దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ 'బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్' ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. కేవలం అధికారం కోసమే కాకుండా రాజకీయ ప్రతిష్ఠాత్మక పోరాటంగా మారిన ఈ ఎన్నికల ఫలితాల ప్రారంభ ధోరణుల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది.
బీజేపీ వర్సెస్ ఠాక్రే సోదరులు
ఈ ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం ఏమిటంటే.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కలిసి ఈ పోరులో నిలిచారు. అయితే ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే వీరిద్దరి కలయిక బీజేపీ-షిండే కూటమిని అడ్డుకోవడంలో తడబడుతున్నట్లు కనిపిస్తోంది.

తాజా గణాంకాలు (ఉదయం 10:30 గంటల వరకు):
మొత్తం 227 సీట్లు ఉన్న బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీ + ఏకనాథ్ షిండే కూటమి 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఠాక్రే సోదరుల కూటమి 30 సీట్ల మార్కును దాటింది. కాంగ్రెస్ కూటమి గతంతో పోలిస్తే మరోసారి బలహీన ప్రదర్శన కనబరుస్తోంది.
పక్కాగా కౌంటింగ్ ఏర్పాట్లు
ముంబై వ్యాప్తంగా 23 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో ఒకేసారి రెండు వార్డుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ విధంగా ఒకే విడతలో 46 వార్డుల ఫలితాలు వెలువడుతున్నాయి. పోలింగ్ శాతం గత 2017 ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగి 46 శాతం నుంచి 50శాతం మధ్య నమోదైంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా?
దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈసారి బీఎంసీపై బీజేపీ-షిండే కూటమి జెండా ఎగురవేస్తుందని అంచనా వేశాయి. 30 ఏళ్లుగా ముంబై మున్సిపల్ రాజకీయాలో చక్రం తిప్పిన ఠాక్రే కుటుంబానికి ఇది చావోరేవో లాంటి పరిస్థితి. ఒకవేళ ఇదే ధోరణి కొనసాగితే, ముంబై పాలనలో కొత్త అధ్యాయం మొదలైనట్లే. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ చిత్రపటం మరింత స్పష్టంగా మారనుంది. మధ్యాహ్నం కల్లా బీఎంసీ పీఠం ఎవరిదనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications