కరోనా విలయం: భయానక వాస్తవం -ప్రభుత్వ ఆస్పత్రిలో శవాల గుట్టలు -ఫ్రీజర్లు లేక కుళ్లిపోయే స్థితికి..
దేశంలో కరోనా వైరస్ రెండో సారి వ్యాప్తి అత్యంత భయానకంగా, గతంలో కంటే ప్రమాదకరంగా విజృంభిస్తున్నది. కొత్త కేసులు రెండు లక్షలకు చేరువకాగా, ప్రతిరోజూ దాదాపు వెయ్యిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాది కాలంగా కరోనాతో పోరాడుతున్నప్పటికీ దేశీ ఆరోగ్య రంగం ఏమాత్రం మెరుగుపడలేదనే చేదు వాస్తవం, దాని తాలూకు భయానక దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి..
ఆదివాసీ గిరిజనులు అధికంగా నివసించే ఛత్తీస్‌గఢ్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్నది. కొత్త కేసులు, మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ఆసుపత్రుల్లో కరోనా మృతదేహాలు పేరుకుపోతున్నాయి. తగినన్ని ఫ్రీజర్లు లేకపోవడంతో మార్చురీలలో గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పడి ఉంటున్నాయి. వాటిలో కొన్ని కుళ్లిపోయే దశకు చేరడం గగుర్పాటును కలిగిస్తున్నది.

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గల డాక్టర్ అంబేద్కర్ స్మారక ఆసుపత్రిలో కరోనా మృతుల సంఖ్య కలకలం రేపుతున్నది. రోజుకు పది నుంచి యాభై వరకు కరోనా రోగులు మరణిస్తున్నారు. దీంతో మృతదేహాల సంఖ్య పెరిగిపోతున్నది. వాటిని ఉంచేందుకు చోటు ఉండటం లేదు. కొన్ని మృతదేహాలు అంత్యక్రియలకు తరలించేలోపు మరిన్ని వచ్చి చేరుతున్నాయి. శ్మశానవాటికలు కూడా కరోనా మృతులతో నిండిపోతున్నాయి. ఒక్క రాయ్‌పూర్ నగరంలోనే ప్రతి రోజు 55 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మరోవైపు ఎలాంటి లక్షణాలు లేని కరోనా రోగులు కూడా త్వరగా చనిపోతున్నారని, గుండెపోటుకు గురవుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయ్‌పూర్, దుర్గ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉన్నదని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం రికార్డు స్థాయిలో 10,521 కరోనా కేసులు, 122 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,297కు మరణాల సంఖ్య 4,899కు పెరిగింది.












Click it and Unblock the Notifications