కర్ణాటక సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత - ఘర్షణలు - అరెస్టులు: బస్సులు రద్దు
బెంగళూరు: కర్ణాటక- మహారాష్ట్ర మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న వివాదం మరింత ముదిరింది. దాడుల వరకు వెళ్లింది. ఘర్షణలకు దారి తీసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకున్నా కూడా దీనికి తెర పడట్లేదు. వివాదాన్ని పరిష్కరించే విషయంలో ముఖ్యమంత్రులు ఎవరి పట్టుదలను వారు ప్రదర్శిస్తోన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనత పార్టీ, దాని మిత్రపక్షం అధికారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దశాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తోన్న సరిహద్దు వివాదం ఇది. 1957లో రాష్ట్రాల పునర్విభజన సమయంలో తలెత్తింది. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. సరిహద్దులకు ఆనుకుని ఉండే బెళగావి కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఆ భూభాగం తమదంటే తమదంటూ పోటీ పడుతున్నాయి. అప్పట్లో మరాఠీ మాట్లాడే ప్రజలు పెద్ద ఎత్తున నివసించే ప్రాంతాలను కర్ణాటకలో విలీనం చేయడం దీనికి కేంద్రబిందువు.

కర్ణాటకలో ఉన్న బెళగావి, నిప్పాణి, కార్వార వంటి ప్రాంతాలతో పాటు 814 గ్రామాలు తమకు చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోంది. అప్పటి మహాజన్ కమిషన్ ఆధారంగా ఈ విభజన చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. బెళగావి జిల్లాలో మహారాష్ట్ర మంత్రి పర్యటనకు పూనుకోవడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. ఆయన పర్యటించకూడదంటూ స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.
దీని తరువాత- బెళగావి సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పర్యటనను అడ్డుకోవడానికి కర్ణాటక రక్షణ వేదికె ప్రతినిధులు పెద్ద సంఖ్యలో బెళగావికి చేరుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో బైఠాయించారు. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాల రాకపోకలకూ అడ్డుపడ్డారు. అదే సమయంలో మహారాష్ట్రలో ఉన్న కర్ణాటక రిజిస్ట్రేషన్ వాహనాలపై దాడులు జరిగాయంటూ వచ్చిన వార్తలతో ఆందోళనకారులు భగ్గుమన్నారు. అటు మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి కూడా సరిహద్దుల్లోో ఆందోళనలను చేపట్టింది.
మహారాష్ట్ర వైఖరికి నిరసనగా బెళగావికి వెళ్లడానికి ప్రయత్నించిన కర్ణాటక రక్షన వేదికె అధ్యక్షుడు టీఏ నారాయణగౌడను పోలీసులు అరెస్టు చేశారు. 100 మందికి పైగా కార్యకర్తలను హిరే బాగేవాడి వద్ద అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా వేదికె కార్యకర్తలు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్లు గల లారీలు, ట్రక్కులపై రాళ్లు రువ్వారు. ఆయా వాహనాల నంబర్ ప్లేట్‌లకు నల్ల రంగు పూశారు. వాటిపై కన్నడ జెండాలు కట్టారు.












Click it and Unblock the Notifications