బ్యాంకులోనే ప్రసవించిన గర్భిణీ.. బుడ్డోడికి క్యాషియర్‌గా నామకరణం
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఓ గర్భిణీ మగబిడ్డను ప్రసవించడంతో ఆ బుడ్డోడికి క్యాషియర్ అని నామకరణం చేశారు.
కాన్పూర్: నోట్ల రద్దు వల్ల దేశంలో సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల ముందు నోట్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పలు బ్యాంకుల వద్ద స్వల్ప ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
తాజాగా నోట్ల రద్దు నేపథ్యంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. ఈ నెల 2వ తేదీన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఓ గర్భిణీకి నొప్పులు రావడంతో ఆమెకు బ్యాంకులోనే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బాబుకి ఏమని పేరు పెట్టిన పేరు వింటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురికావాల్సిందే.

'క్యాషియర్' అనే అర్థం వచ్చేలా 'ఖజాంచి నాథ్' అని నామకరణం చేశారు. ఖజాంచి అనే పదం ఖజానా నుంచి పదం నుంచి పుట్టింది. కాగా, ఆ పసివాడి తల్లిపేరు సర్వేషా దేవి. ఆమె భర్త రెండు నెలల క్రితం ఓ ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబానికి సర్కారు పరిహారాన్ని ప్రకటించగా... ఆ డబ్బును డ్రా చేసుకోవడం కోసం సర్వేషా దేవి 2వ తేదీన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వచ్చింది.
అక్కడే పురిటి నొప్పులు రావడం.. మగబిడ్డను ప్రసవించడం జరిగిపోయాయి. ఇప్పటికే నలుగురు పిల్లలున్న ఆమెకు ఇప్పుడు పుట్టిన 'క్యాషియర్' ఐదోవాడు కావడం గమనార్హం. తన సోదరి బ్యాంకులో ప్రసవించిందన్న విషయం తెలియగానే.. అక్కడికి చేరుకున్న ఆమె సోదరుడు అనిల్ ఆ బుడ్డోడికి 'ఖజాంచి నాథ్' అని నామకరణం చేశాడు.












Click it and Unblock the Notifications