రాహుల్ గాంధీ! బ్రిటన్ పౌరుడిగా చెప్పుకున్నారా?
న్యూఢిల్లీ: తన జాతీయత గురించి ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని ఎప్పుడూ చెప్పే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోటీసులు పంపించినట్లు పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సభ్యుడు అర్జున్ రామ్ మెగ్వాల్ తెలిపారు.
బ్రిటన్‌లోని ఓ కంపెనీకి సంబంధించిన పత్రాల్లో రాహుల్ తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారని, అలా ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో డిమాండ్ చేశారు. 'బ్రిటన్ సిటిజన్‌గా తనను తాను ఎందుకు రాహుల్ గాంధీ పేర్కొన్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చాం' అని అర్జున్ అన్నారు.
2003లో ఓ కంపెనీకి సంబంధించిన పత్రాల్లో రాహుల్ గాంధీ తనను తాను బ్రిటన్ పౌరుడుగా ప్రకటించుకున్నారని గతంలో భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.

రాహుల్ తన పుట్టిన రోజును సరిగానే ప్రకటించారు కానీ, బ్రిటన్ జాతీయుడిగా పేర్కొన్నారని అందులో వివరించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లూ తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు కేంద్రమంత్రి మహేశ్ గిరి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి స్పీకర్ పంపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. పౌరసత్వంపై రాహుల్ వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. కాగా, దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎథిక్స్ ప్యానెల్‌కు ఫిర్యాదును పంపేముందు రాహుల్ గాంధీని సంప్రదించకుండా స్పీకర్ వివక్ష చూపారని కాంగ్రెస్ వర్గీయులు విమర్శించారు.












Click it and Unblock the Notifications