కేంద్ర బడ్జెట్‌లో ఊరట: ఐటి స్లాబ్ 30 నుంచి 25 శాతానికి కట్
న్యూఢిల్లీ: మధ్యతరగతి, ఉన్నత శ్రేణి ప్రజలకు ఊరట కలిగిస్తూ వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆదాయం పన్ను స్లాబ్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రత్యక్ష పన్నులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
వార్షికాదాయం రూ. 10 లక్షలకు మించి ఉన్నవారికి అది వర్తిస్తుంది. జిఎస్టీ రూపంలో పరోక్ష పన్నులు పెరిగిన నేపథ్యంలో ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Recommended Video


దాదాపు 125 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశంలో కేవలం 3 కోట్ల మంది ఐటి రిటర్న్స్ దాఖలు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. 2014 - 15 అంచనా సంవత్సరంలో 25 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తమ వార్షికాదాయాన్ని10 లక్షల రూపాయలకు పైగా చూపించారు.
ఈ స్థితిలో ఐటి స్లాబ్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తే ప్రత్యక్ష పన్నుల వసూలు పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. నూతన మధ్యతరగతి చాలా వరకు వార్షికాదాయం 10 లక్షల రూపాయలకు పైబడి ఉన్నవారి జాబితాలో చేరుతారు.
ఆాదాయం పన్ను స్లాబ్‌ను తగ్గించే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతోనూ నీతి ఆయోగ్ అధికారులతోనూ చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 2016 - 17లో రూ.8.47 కోట్లు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సం (2017-18)లో 2017 సెప్టెంబర్ నాటికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 3.86కోట్లు ఉంది. ప్రత్యక్ష పన్నుల జాబితాలో ఆదాయం పన్ను, సంపద పన్ను, కార్పోరేట్ పన్ను, సెక్యురిటీస్ లావాదేవీల పన్ను మొదలైనవి ఉన్నాయి.
ప్రస్తుతం సున్నా నుంచి 2,50.000 వరకు వార్షికాదాయానికి పన్ను లేదు. 2,50,001 నుంచి 5 లక్షల రూపాయల వార్షికాదాయం ఉన్నవారికి ఐదు శాతం పన్ను పడుతోంది. 5 లక్షల 1 రూపాయి నుంచి10 లక్షల రూపాయల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం, పది లక్షలు, ఆ పైబడి ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను విధిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పన్నును 25 శాతానికి తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆదాయం పన్ను చెల్లించేవారి సంఖ్య పెరగడమే కాకుండా మధ్యతరగతి, ఉన్నతశ్రేణి వర్గాలకు కాస్తా ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications